IND Vs ENG T20 Playing 11 | ఐదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ బుధవారం జరుగనున్నది. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ దూరమైన విషయం తెలిసిందే. ఇటీవల దేశీయ క్రికెట్లో రాణించి ఫిట్నెస్ సాధించిన షమీ.. మళ్లీ జట్టులో చోటు సాధించాడు. రేపు జరుగబోయే టీ20లో అందరి షమీపైనే ఉన్నది.
టీ20 ఫార్మాట్లో భారత్‌ను ఓడించడం అంత సులభమేమీ కాదు. అయితే, ఈ ఫార్మాట్లో భారత జట్టుపై ఇంగ్లాండ్ రికార్డు మెరుగ్గా ఉన్నది. అగ్రశ్రేణి జట్లలో అత్యధిక విజయశాతం కలిగిన జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. 24 మ్యాచుల్లో భారత జట్టుపై ఇంగ్లాండ్ 11 సార్లు గెలిచింది. విజయశాతం 45.80శాతం ఉన్నది. ఇతర జట్లతో పోలిస్తే అత్యధికం. అదే సమయంలో దక్షిణాఫ్రికార, న్యూజిలాండ్ విన్నింగ్ రేటు శాతం భారత్‌పై మెరుగ్గానే ఉంది. అయితే, ఏ జట్టయినా భారత్‌ను సొంత మైదానాల్లో ఓడించడం అంత తేలికైన విషయం కాదు. కొంతకాలంగా టీ20 భారత్ రికార్డు అజేయంగా ఉన్నది. ఇదిలా ఉండగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా అనేక చారిత్రాత్మక విజయాలను నమోదు చేసింది. టీ20ల్లో భారత్‌కు అచ్చివచ్చిన మైదానం. ఇప్పటి వరకు ఇక్కడ ఏడు ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడింది. ఇక్కడ ఇంగ్లాండ్‌తో ఆడిన ఏకైన టీ20లో మాత్రం ఇంగ్లాండ్‌పై ఓడిపోయింది. 2011లో ఆడిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టుకు ఇంగ్లాండ్‌ను ఓడించే అవకాశం వచ్చింది.
గత టీ20 వరల్డ్ కప్‌ని టీమిండియా కైవసం చేసుకున్నది. ఆ తర్వాత ఈ ఫార్మాట్లో జట్టులో చాలా మార్పులే వచ్చాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. శుభ్‌మాన్ గిల్‌కు సైతం ఛాన్స్ ఇవ్వకపోవడంతో టాప్ ఆర్డర్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. సంజు శాంసన్, అభిషేక్ శర్మ గత కొన్ని సిరీస్‌ల నుంచి ఓపెనింగ్ చేస్తూ వస్తున్నారు. ఇదే జోడీ ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ ఇన్సింగ్స్‌ను ప్రారంభించే ఛాన్స్ ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మూడు, నాలులో ప్లేసుల్లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ స్పష్టంగా ఉంది.
అయితే, బౌలింగ్ విషయం టీమ్ మేనేజ్మెంట్కు ఇబ్బందికరంగా మారుతున్నది. షమీతో పాటు అర్ష్‌దీప్ బౌలింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ స్పిన్నర్లు. కోల్‌కతా పిచ్‌పై వరుణ్ రాణించే అవకాశం ఉండడంతో రవి బిష్ణోయ్ ప్లేస్‌లో వరుణ్‌కు చాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీడియం పేస్ బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న వాషింగ్టన్ సుందర్ స్థానంలో నితీశ్‌రెడ్డి తుదిజట్టులో ఆడే ఛాన్స్ ఉంది. నితీష్‌ను తీసుకుంటే షమీ, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యా రూపంలో జట్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉంటారు. అక్షర్, వరుణ్ స్పిన్ విభాగం బాధ్యతలు తీసుకుంటారు. హార్దిక్, అక్షర్, నితీశ్ ముగ్గురు ఆల్రౌండ్లు కాగా.. లోయర్ ఆర్డర్లో సహకారం అందిస్తారు. నితీశ్‌రెడ్డి ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ తనను తాను నిరూపించుకున్నాడు.
భారత జట్టు ప్లేయింగ్-11 (అంచనా) : సంజు సామ్సన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ జట్టు ప్లేయింగ్-11 (అంచనా) : బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్ (వైస్-కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.