IND vs ENG: లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా భారత్ – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్కోరుబోర్డును నత్తను తలపిస్తున్నది. ఆరంభంలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆత్మరక్షణలో పడింది. క్రీజులో ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ ఉన్నా ఆచితూచి ఆడుతుండటంతో భారత్ మూడంకెల స్కోరు చేయడానికి 25 ఓవర్లు వేచి చూడాల్సి వచ్చింది. 27 ఓవర్ల ఆట ముగిసేసమయానికి భారత్..3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రోహిత్ (66 నాటౌట్), రాహుల్ (37 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు వచ్చిన భారత్.. నాలుగో ఓవర్లోనే తొలివికెట్ను కోల్పోయింది. శుభ్మన్ గిల్ (9) నిరాశపరిచాడు. 9 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా 16 బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. 11.5 ఓవర్లలో 40 పరుగులకే మూడువికెట్లు కోల్పోయిన భారత్.. మరో వికెట్ పడకుండా ఉండేందుకు జాగ్రత్తగా ఆడుతోంది. దీంతో స్కోరుబోర్డు నెమ్మదిగా కదులుతోంది.