IND vs ENG ODI | భారత్-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం రెండో వన్డే జరుగనున్నది. అందరి దృష్టి స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ క్లోహీపైనే ఉన్నది. నాగ్‌పూర్ వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. కుడి మోకాలు వాపు కారణంగా మ్యాచ్‌కు దూరమైనట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ నెల 9న జరిగే కటక్ వన్డేకు విరాట్ ఆడుతాడని వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. తొలి వన్డేకు కొద్ది సమయం ముందు మోకాలి వాపు రావడంతో.. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. కోహ్లి గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు. రెండు వన్డేలో విరాట్ ఆడితే.. తుదిజట్టు నుంచి శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్లో ఎవరిని తొలగిస్తారన్న ప్రశ్న ఎదురవుతున్నది. అయితే, శ్రేయాస్ ఆడిన విధానం నేపథ్యంలో డ్రాప్ చేసే అవకాశాలు తక్కువే.
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్నది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండో వన్డేలో విరాట్ ఆడుతాడని వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఖచ్చితంగా చెప్పినప్పటికీ.. విరాట్ గాయం తీవ్రతపై బీసీసీఐ మెడికల్ టీమ్ అధికారిక ప్రకటన చేయలేదు. మెడ గాయం కారణంగా గత నెలలో ఢిల్లీ తరఫున సౌరాష్ట్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో విరాట్ ఆడలేదు. ఆ తర్వాత రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిగ్గానే అవుట్ అయ్యాడు. రెండో వన్డేలో విరాట్ ఆడితే ఫామ్, ఫిట్నెస్ రెండింటినీ నిరూపించుకోవాల్సిందే.
ఇక కటక్ వన్డేలో విరాట్ కోహ్లీ ఆడితే.. తుదిజట్టు కూర్పు టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారనున్నది. విరాట్ ఆడని చివరి క్షణంలో శ్రేయాస్ అయ్యర్‌ను తుది జట్టులోకి టీమ్ మేనేజ్మెంట్ తీసుకుంది. మ్యాచ్‌కు ముందు రోజు తనకు పిలుపువచ్చిందని.. విరాట్‌కు మోకాలి గాయం కారణంగా తుదిజట్టులో ఉండాల్సి ఉంటుందని చెప్పారని శ్రేయాస్ అయ్యార్ తెలిపాడు. నాగ్‌పూర్ వన్డేలో అయ్యర్ 36 బంతుల్లోనే 59 పరుగులు చేసి టీమిండియా గెలువడంలో కీలక పాత్ర పోషించాడు. గిల్‌తో కలిసి 94 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో రెండో వన్డే నుంచి అయ్యర్‌ను తప్పించడం టీమ్ మేనేజ్మెంట్కు కష్టమే. పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాయింట్ సైతం కీలక వ్యాఖ్యలు చేశాడు. వైట్ బాల్ ఫార్మాట్లో అయ్యర్‌కు జట్టులోకి తీసుకోకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని పేర్కొన్నాడు.
కటక్ వన్డేకు తుదిజట్టును ఎంపిక చేయడంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు అటు టీమ్ మేనేజ్మెంట్కు కష్టంగా మారింది. ఇప్పటికే మూడో స్థానంలో వచ్చిన గిల్ 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ను ఆడాడు. తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన జైస్వాల్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. యశస్విని తుది జట్టు నుంచి తప్పిస్తే విరాట్‌ను తుదిజట్టులో స్థానం కల్పించేందుకు ఛాన్స్ ఉంది. దాంతో గిల్ మళ్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ సమీకరణలు రోహిత్ శర్మపై భారీగానే ఒత్తిడి పెంచుతున్నాయి. గత కొంతకాలంగా రోహిత్ సైతం ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నాడు. నాగ్‌పూర్ వన్డేలో ఏడు బంతులు ఆడి కేవలం రెండు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కటక్‌లోనూ ఈ పరిస్థితి రాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. రెండో వన్డేలో రోహిత్‌పై భారీగానే ఒత్తిడి ఉండనున్నది. గిల్లో కలిసి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయనుండగా.. విరాట్ మూడో ప్లేస్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. నాలుగో స్థానంలో అయ్యర్ బ్యాటింగ్‌కు దిగే ఛాన్స్ ఉంది.
నాగ్‌పూర్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్‌తో రోహిత్ చర్చలు జరిపాడు. ఆ సమయంలో తొలి వన్డేలో పరుగులు చేయలేకపోయాననే బాధ రోహిత్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. హెడ్‌కోచ్‌తో సుదీర్ఘంగా చర్చిస్తున్న సమయంలో రోహిత్ ముఖంలో కనిపించిన భావాలు మాత్రం.. చర్చలు సీరియస్‌గా సాగినట్లు తెలుస్తున్నది. ఇద్దరు చర్చించింది రోహిత్ బ్యాటింగ్ గురించా.. లేదంటే చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వ్యూహంపైనా అనేది స్పష్టత లేదు.
నాగ్‌పూర్ వన్డేలో కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు టీమ్ మేనేజ్మెంట్ ఛాన్స్ ఇచ్చింది. ఇక రెండో వన్డేలో రిషబ్ పంత్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు వీలైనన్ని ఎక్కువగా ప్రయోగాలు చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆడే అవకాశం వచ్చినా తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు చేరాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో కటక్ వన్డేలో రాహుల్‌ను పక్కనపెట్టి రిషబ్ పంత్‌ను బరిలోకి దింపాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తున్నది. అలాగే, చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వరుణ్ చక్రవర్తికి సైతం చోటు కల్పించాలనే చర్చ జరుగుతున్నది. గాయం నుంచి కోలుకున్న కుల్దీప్ యాదవ్ తొలి వన్డేలో 9.4 ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ పరిస్థితుల్లో కుల్దీప్ స్థానంలో వరుణ్‌కు అవకాశం ఇవ్వొచ్చన్న చర్చ సాగుతుంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్/రిషబ్ పంత్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ/అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి.