Jasprit Bumrah: వైజాగ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు మూడో టెస్టుకు ముందు భారీ షాక్ తప్పేట్టు లేదు. విశాఖపట్నం వేదికగా ముగిసిన రెండో టెస్టులో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా ఏస్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా.. ఈనెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగాల్సి ఉన్న మూడో టెస్టు ఆడేది అనుమానమే. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకు రాజ్‌కోట్ టెస్టులో విరామమివ్వనున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. బుమ్రా స్థానంలో సిరాజ్ భారత పేస్ దళాన్ని నడిపించే అవకాశాలున్నాయి.
వైజాగ్ మ్యాచ్ తర్వాత రాజ్‌కోట్ టెస్టుకు ఇంకా పది రోజుల సమయముంది. అయినా సెలక్టర్లు మాత్రం బుమ్రాకు వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో విరామమివ్వడం గమనార్హం. రాబోయే రోజుల్లో ఐపీఎల్‌తో పాటు జూన్‌లో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ఆడనున్న నేపథ్యంలో అతడిని ఫ్రెష్‌గా ఉంచేందుకు సెలక్టర్లు బుమ్రాకు విశ్రాంతినివ్వనున్నట్టు తెలుస్తున్నది. వైజాగ్‌లో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 32 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిన ఈ స్టార్ పేసర్.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. హైదరాబాద్ టెస్టులో కూడా బుమ్రా సుమారు 25 ఓవర్లు బౌలింగ్ చేసి ఆరు వికెట్లు తీశాడు. రెండు టెస్టులలో కలిపి ఐదు వికెట్లు తీసిన బుమ్రాకు విశ్రాంతి అవసరమని సెలక్టర్లు భావిస్తున్నట్టు ‘క్రిక్‌బజ్’ కథనం పేర్కొంది.
Jasprit Bumrah could be rested from the 3rd Test against England in Rajkot. (Cricbuzz). pic.twitter.com/GhFxbpNU3e
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2024
ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు జట్టును మంగళవారం ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. బుమ్రాకు మూడో టెస్టులో విరామమివ్వనున్న సెలక్టర్లు.. కెఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. హైదరాబాద్ టెస్టులో గాయపడ్డ రాహుల్.. వైజాగ్‌లో ఆడలేదు. కానీ మిగిలిన మూడు టెస్టులకు మాత్రం అతడు అందుబాటులో ఉంటాడని సమాచారం.