IND Vs ENG | బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైంది. 336 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. ఈ నెల 10 నుంచి మూడో టెస్ట్ జరుగనున్నది. తొలి టెస్ట్‌లో గెలిచిన ఇంగ్లండ్ జట్టు.. రెండోటెస్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఘోర పరాజయంతో లార్డ్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఆతిథ్య జట్టు కీలక మార్పులు చేసింది. రెండో టెస్టులో బౌలర్లు పెద్దగా రాణించకపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నది. బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్ త్రయం అద్భుతం చేయలేకపోయింది. ఈ క్రమంలో ప్లేయింగ్-11లో పేసర్ గస్ అట్కిన్సన్ను మూడో టెస్టుకు ఎంపిక చేసింది.
ఇంగ్లండ్ జట్టు జోఫ్రా ఆర్చర్‌తో పాటు జామీ ఓవర్టన్కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఓవర్టన్, అట్కిన్సన్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేసే సత్తా ఉన్నది. దాంతో జట్టు ప్రయోజనకరంగా ఉండనున్నది. లార్డ్స్ మైదానం ఫాస్ట్ బౌలర్లకు ఉపకరిస్తుంది. ఈ క్రమంలో షోయబ్ బషీర్ స్థానంలో అదనంగా ఫాస్ట్ బౌలర్‌ను ఆడించాలని భావించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో క్రిస్ వోక్స్ లేదంటే కార్సేకు అవకాశం ఇవ్వొచ్చు. అదే సమయంలో ఓ బ్యాట్స్‌మన్‌కి విశ్రాంతి ఇస్తే.. జాకబ్ బెథెల్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
బెథెల్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. రెండోటెస్టులో ఐదురోజు వర్షం కారణంగా ఆట ఆలస్యంగా మొదలైంది. ఆ తర్వాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇంగ్లండ్‌ను 336 పరుగుల తేడాతో భారత్ ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. బర్మింగ్‌హామ్ టెస్టులో ఆకాశ్ 186 పరుగులు ఇచ్చి పది వికెట్ల కూల్చాడు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఆకాశ్ దీప్ అద్భుత బౌలింగ్‌తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇన్నింగ్స్‌లో 88 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా.. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులు ఇచ్చి ఆరు వికెట్ల తీశాడు. 608 పరుగుల అసాధ్యమైన లక్ష్య చేధనలో ఆతిథ్య జట్టు 271 పరుగులకు ఆలౌట్ అయ్యింది.