IND vs ENG 1st Test: భారత్‌లో టెస్టు సిరీస్ గెలవాలనే లక్ష్యంతో వచ్చిన బెన్ స్టోక్స్ సేన.. గత ఏడాదిన్నరకాలంగా ‘బజ్‌బాల్’ ఆటతోనే టీమిండియాను దెబ్బతీయాలని భావిస్తున్నది. అయితే ఇంగ్లండ్ పప్పులు భారత్‌లో ఉడకవని, ఒకవేళ అలా (బజ్‌బాల్ ఆట) ఆడితే టెస్టులు ఒకటిన్నర, రెండు రోజుల్లోనే ముగిస్తామని హెచ్చరిస్తున్నాడు హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్. ప్రతి బంతిని బాదాలని చూస్తే ఇండియాలో కుదరదని అన్నాడు. హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి ఉప్పల్ వేదికగా ఆరంభం కావాల్సి ఉన్న తొలి టెస్టు నేపథ్యంలో జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సిరాజ్ మాట్లాడుతూ… ‘ఒకవేళ ఇంగ్లండ్ గనక బజ్‌బాల్ ఆట ఆడితే మ్యాచ్ ఒకటిన్నర రోజు లేదా రెండు రోజుల్లోనే ముగుస్తుంది. ఉపఖండంలో ఉన్న పిచ్‌లపై ప్రతి బంతిని బాదడం కుదరదు. ఇక్కడ బంతి టర్న్ అవుతుంది. నా అభిప్రాయం ప్రకారమైతే ఇక్కడ బజ్‌బాల్ ఆట కుదరదు. అలా కాదని వాళ్లు అదే ఆట ఆడితే అది మాకే లాభం. మ్యాచ్‌ను మేం త్వరగా ముగిస్తాం…’ అని చెప్పాడు.
ఇక ఈ సిరీస్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యావన్న ప్రశ్నకు సిరాజ్ బదులిస్తూ… ‘ఇంగ్లండ్ గత టూర్ (2021)లో నేను రెండు మ్యాచ్‌లు ఆడాను. ఒక మ్యాచ్‌లో ఐదు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాను. జో రూట్, జానీ బెయిర్ స్టో వికెట్లు పడగొట్టాను. ఇప్పుడు నా లక్ష్యం ఏంటంటే.. నేను ఎన్ని ఓవర్లు వేసిన కచ్చితత్వంతో బౌలింగ చేస్తూ పరుగులను కట్టడి చేసి వారిపై ఒత్తిడి తీసుకురావాలి. వికెట్లు వస్తే అది డబుల్ హ్యాపీ. వికెట్లు రాకపోయినా నేను నిరాశపడను. ఓపికగా వేచి చూస్తూ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తా..’ అని అన్నాడు.
Mohammad Siraj said – “Bazball won’t work in India. If England plays Bazball then match might end in one & half or two days”. pic.twitter.com/2gsKEsGvCW
— CricketMAN2 (@ImTanujSingh) January 24, 2024
29 ఏండ్ల సిరాజ్ ఇప్పటివరకూ 23 టెస్టులు ఆడి 68 వికెట్లు పడగొట్టాడు. 2020లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ వేదికగా అరంగేట్రం చేసిన సిరాజ్‌కు తన సొంత మైదానమైన హైదరాబాద్‌లో ఇదే తొలి టెస్టు కావడం గమనార్హం. ఉప్పల్‌లో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ ఇంతవరకూ టెస్టు ఆడలేదు. 2018 తర్వాత ఉప్పల్‌లో టెస్టు మ్యాచ్‌లు జరుగకపోవడంతో రేపట్నుంచి జరుగబోయే టెస్టులో సొంతగడ్డపై సత్తా చాటాలని సిరాజ్ భావిస్తున్నాడు.