బడంగ్పేట్, జనవరి 9: ఎదుగుతున్న కుమారుడి ఉజ్వల భవిష్యత్తుకు బాటలేయాల్సిన తల్లి విషమిచ్చి కానరాని లోకాలకు పంపింది. నవమాసాలు మోసిన కన్న కొడుకుకు తానే స్వయంగా విషమిచ్చి కడతేర్చింది. కొడుకు మరణం తర్వాత తాను ఈ లోకంలో ఉండలేననుకున్న మాతృమూర్తి తానూ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. కన్న కూతురు అకాల మరణాన్ని చూసి తట్టుకోలేని ఆమె తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ హృదయ విదారక ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో చోటుచేసుకుంది.
మీర్‌పేట సీఐ శంకర్ నాయక్ కథనం ప్రకారం.. హస్తినాపురం డివిజన్ పరిధిలోని జయకృష్ణ ఇన్క్లెవ్ కాలనీలో యశ్వంత్ రెడ్డి, ఆయన భార్య సుస్మిత(27) కుమారుడు యశ్వంత్ నందరెడ్డి (11నెలలు) ఉంటున్నారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుస్మిత తన కుమారుడికి విషమిచ్చి ఆ తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకున్నది. కూతురును విగతజీవిగా ఉండడాన్ని చూసిన తన తల్లి లలిత(50) గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. యశ్వంత్‌రెడ్డి వేధింపుల వల్లనే సుస్మిత, కుమారుడు మరణించారని బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
కుమారుడికి విషమిచ్చి, భార్యను హత్య చేసి యశ్వంత్‌రెడ్డి ఆత్మహత్యగా చిత్రీకరించారని బాధితురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. సుస్మిత, ఆమె కుమారుడి అకాల మరణంపై పలు అనుమానులు ఉన్నట్లు బంధువులు చెప్తున్నారు. సుస్మిత, యశ్వంత్ నందరెడ్డి గురువారం మృతి చెందితే పోలీసులు కూడా బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచారని ఆరోపిస్తున్నారు. తల్లీకుమారుల మృతి ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. పోలీసులు కూడా యశ్వంత్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.