Mohammed Shami | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య దుబాయి వేదికగా మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ శాంటో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 2023 తర్వాత తొలిసారిగా ఐసీసీ టోర్నీలో ఆడుతున్న మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి పవర్ ప్లేలో బంగ్లాదేశ్‌కు షాక్ ఇచ్చాడు. బంగ్లా బ్యాటర్ సౌమ్య సర్కార్ షమీ బౌలింగ్‌లో కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హసన్ మిరాజ్ సైతం షమీ బౌలింగ్‌లోనే శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లతో షమీ అరుదైన ఘనత సాధించాడు. 2015 తర్వాత వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ కలిపి పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ సమయంలో 19.8 స్ట్రయిక్ రేట్‌తో బౌలింగ్ చేసి 20 వికెట్లు తీయడం విశేషం. ఈ జాబితాలో షమీ కంటే ముందు న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. బౌల్ట్ 26 వికెట్ల పడగొట్టగా స్ట్రయిక్ రేట్ 33.6గా ఉన్నది. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ 19 వికెట్లతో మూడో స్థానంలో, 14 వికెట్లతో క్రిస్ వోక్స్ నాలుగో ప్లేస్, 13 వికెట్లతో జోష్ హేజిల్‌వుడ్ ఐదో స్థానంలో ఉన్నాడు.
చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణాకు మరో వికెట్ దక్కింది. ఇక పవర్ ప్లేలో స్పిన్నర్ అక్షర్ పటేల్ సైతం రెండు వికెట్లు పడగొట్టాడు. తొమ్మిదో ఓవర్లో వరుసగా బంతుల్లో రెండు వికెట్లు తీసిన అక్షర్ తృటిలో హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు. అక్షర్ పటేల్ తాను వేసిన తొలి ఓవర్ రెండో బంతికి తంజిద్ హసన్‌ను అవుట్ చేశాడు. మూడు బంతికి ముష్ఫికర్ రహిమ్ను పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో జకీర్ అలీకి వేయగా.. బ్యాటుకు తగిలి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతుల్లోకి వెళ్లింది. ఈజీగా వచ్చిన క్యాచ్‌ను రోహిత్ అందుకోలేకపోయాడు. దాంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్సయ్యింది. తొలి పవర్‌ప్లేలో పది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ 39 పరుగులు చేసింది.
2002లో న్యూజిలాండ్‌తో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో తొలి పది ఓవర్లలో బంగ్లాదేశ్ 44 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. 2006లో భారత్‌లోని మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో మొదటి పది ఓవర్లలో 27 పరుగులకే 6 వికెట్లు నష్టపోయింది. 2004లో సౌతాంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్‌పై బంగ్లాదేశ్ 26 పరుగులకే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది. తాజాగా 2025 దుబాయి వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 39 పరుగులకే ఐదు నష్టపోయింది.
భారత జట్టు వన్డేల్లో వరుసగా 11వసారి టాస్ ఓడిపోయింది. 2023 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత భారత జట్టు ఒక్క టాస్ కూడా గెలవలేదు. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆడిన తుదిజట్టులోనే భారత కెప్టెన్ రోహిత్ మార్పులు చేశాడు. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్‌లను పక్కనపెట్టి.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాను తుదిజట్టులోకి తీసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై గెలుపొందిన జైత్రయాత్ర కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉన్నది. బంగ్లాదేశ్‌పై ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రికార్డు మెరుగ్గానే ఉన్నది.