IND Vs AUS | ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐదు టెస్టుల బోర్డర్ – గవాస్కర్ ట్రోపీలో 1-2 తేడాతో టీమిండియా భారత వెనుకపడింది. జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగనున్నది. చివరి టెస్ట్‌లో కాంబినేషన్ టీమిండియాకు సవాల్‌గా మారనున్నది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నాలుగో టెస్ట్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఐదో టెస్టుకు ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్స్‌తో బరిలోకి దిగాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
నాలుగో టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్లేయింగ్-11 నుంచి గిల్‌ను తప్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీని టీమిండియా నిలబెట్టుకోవడంతో పాటు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే.. రోహిత్ జట్టుకు బెస్ట్ ఆప్షన్స్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత కెప్టెన్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో తన ఆరుగురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్‌ను రంగంలోకి దించాల్సిందేనని చెబుతున్నారు. ఇదే జరిగితే మెల్బోర్న్ టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్‌కు సిడ్నీ టెస్ట్ ప్లేయింగ్ 11 చోటు దక్కేందుకు మార్గం సుగమం కానున్నది.
గతేడాది 2024లో టెస్టు క్రికెట్లో శుభ్‌మన్ గిల్ రాణించాడు. టెస్టుల్లో 866 పరుగులు చేశాడు. గతేడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి జైస్వాల్ తొలిస్థానంలో ఉండగా.. శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో గిల్‌ను పక్కనపెట్టడానికి గల కారణాలను జట్టు మేనేజ్మెంట్ అతనికి తెలిపిందని కెప్టెన్ రోహిత్ తెలిపాడు. ఐదు ఇన్నింగ్స్‌లో కేవలం 31 పరుగులు చేసిన రోహిత.. మొత్తం చివరి 14 ఇన్నింగ్స్‌లో కలిపి 155 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, చివరి టెస్ట్ నుంచి రోహిత్ వైదొలిగి గిల్‌కు ఆడే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో కేఎల్ రాహుల్‌తో కలిసి మళ్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే ఛాన్స్ ఉంది.
మెల్బోర్న్ టెస్టులో ఆల్‌రౌండ్‌గా వాషింగ్టన్ సుందర్‌కు చోటు కల్పించడంతో గిల్ దూరమయ్యాడు. వాషింగ్టన్ సుందర్ మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేసి సత్తా చాటాడు. నితీశ్రెడ్డితో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అలాగే, తొలి ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ తీశాడు. అతనికి ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. దాంతో వాషింగ్టన్ సుందర్ లేదంటే తనుష్ కోటియన్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే, మరో స్పిన్నర్ జాడేజా ఆడడం దాదాపు ఖాయమే. సిడ్నీలో ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు వద్దనుకుంటే గిల్‌కు ఛాన్స్ ఇచ్చే సూచనలున్నాయి. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లలో ఎవరో ఒకరిని పక్కన పెట్టేందుకు ఆస్కారం ఉంది. సుందర్‌కు తుదిజట్టులో చోటు దక్కితే.. సిడ్నీలో జడేజాతో కలిసి మరిన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించే అవకాశం ఉంది.