IND Vs AUS | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో మూడో టెస్ట్ శనివారం మొదలైంది. వర్షం కారణంగా తొలిరోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 19 పరుగులతో, నాథన్ మెక్‌స్వీనీ నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మ్యాచ్ మొదలయ్యాక తొలిసారి 5.3 ఓవర్ల సమయంలో వర్షం కురిసింది. దాంతో దాదాపు 20 నుంచి 25 నిమిషాల వరకు మ్యాచ్ ఆగిపోయింది. మళ్లీ 13.2 ఓవర్ల వద్ద మరోసారి వర్షం మొదలుకావడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మ్యాచ్‌కు వాతావరణం అనుకూలించలేదు. తొలిరోజు మ్యాచ్ వర్షార్పణం కావడంతో రెండోరోజు 98 ఓవర్ల వేయనుండగా.. మ్యాచ్ నిర్ణీత సమయానికంటే అరగంట ముందే మొదలుకానున్నది.
రెండో రోజు మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఉదయం 5.20 గంటలకు ప్రారంభం కానున్నది. గబ్బా వేదికగా మొదలైన మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణాను పక్కనపెట్టి.. రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్‌కు తుదిజట్టుల్లో ఛాన్స్ ఇచ్చింది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు స్కాట్ బోలాండ్ స్థానంలో జోష్ హేజిల్‌వుడ్‌ని తీసుకున్నది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే భారత్-ఆస్ట్రేలియా జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. కీలకమైన మూడో టెస్ట్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో టీమిండియా ఉన్నది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరాలంటే ఈ సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లన్నీ గెలవాల్సిందే. అదే సమయంలో ఆస్ట్రేలియాది సైతం ఇదే పరిస్థితి.