న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 250 వికెట్లు తీసి, 2500 పరుగులు చేసిన జడేజా.. టెస్టుల్లో వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో జడేజా ఈ ఫీట్ సాధించాడు. రెండో టెస్టులో అసీస్ తొలి ఇన్నింగ్స్ 46వ ఓవర్లో ఉస్మాన్ ఖవాజా.. జడేజాకు 250వ వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కేఎల్ రాహుల్ అద్భతమైన క్యాచ్ పట్టాడు.
జడేజా తన 62వ టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. భారత లెజండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ (65 మ్యాచ్‌లు) కంటే మూడు మ్యాచ్‌లు ముందుగా ఈ ఫీట్ సాధించి రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ లెజండరీ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ (55 మ్యాచ్‌లు).. జడేజా కంటే ఏడు మ్యాచ్‌లు తక్కువలోనే ఈ ఫీట్‌ను అందుకుని అగ్రస్థానంలో ఉన్నాడు.
అదేవిధంగా, తాజా ఫీట్‌తో టెస్టుల్లో 250 వికెట్లు, 2500 పరుగులు చేసిన నాలుగో భారతీయ ఆల్‌రౌండర్‌గా కూడా జడేజా ఘనత వహించాడు. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ జాబితాలో జడేజా కంటే ముందు ఉన్నారు. ఇక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కూడా ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 14వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.