Gautam Gambhir | భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాకు బయలుదేరారు. మంగళవారం అడిలైడ్‌లో టీమిండియాతో కలువనున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇటీవల గంభీర్ స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. పెర్త్‌లో కంగారూ జట్టుతో జరిగిన తొలిటెస్ట్ మ్యాచ్ అనంతరం గంభీర్ స్వదేశానికి వచ్చాడు. కాన్బెర్రా వేదికగా జరిగిన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అయితే, రెండోటెస్ట్‌కు ముందు జట్టుతో చేరనున్నాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు జరగనుంది. ఇది పింక్ బాల్ టెస్ట్ కావడం విశేషం. గంభీర్ గైర్హాజరీలో సహాయక సిబ్బంది అభిషేక్ నాయర్, రియాన్ టెన్ డోస్చాట్, మోర్నే మోర్కెల్ కలిసి జట్టుకు శిక్షణ ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మతో సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు పాల్గొన్నారు. ప్రైమ్ మినిస్టర్స్ లెవెన్ జట్టుపై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో లేడు.
తాజాగా జట్టులో చేరాడు. ఇటీవల కొడుకు పుట్టడంతో రోహిత్ పెర్త్ టెస్ట్‌కు దూరంగా ఉన్నాడు. గతవారం మళ్లీ జట్టుతో చేర్చాడు. రోహిత్ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా తొలి టెస్ట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా.. టీమిండియా 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ గాయం కారణం తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఫిట్నెస్ సాధించాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించి.. ఫామ్‌ని నిరూపించుకున్నాడు. గిల్, రోహిత్‌ల గైర్హాజరీలో ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రోహిత్ జోడీలోకి వచ్చిన తర్వాత భారత జట్టు మేనేజ్మెంట్ ఓపెనింగ్ జోడీలో ఏమైనా మార్పులు చేస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేఎల్, యశస్వి ఇన్నింగ్స్‌ను ఓపెనింగ్ చేయడానికి రాగా, రోహిత్ నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు.