చెన్నై: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచకప్‌లో అరుదైన ఘనత సాధించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇవాళ భారత్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఏడో ఓవర్ రెండో బంతికి ఫోర్ కొట్టడం ద్వారా వార్నర్ వన్డే ప్రపంచకప్‌లో వెయ్యి పరుగుల మైలు రాయిని దాటేశాడు. దాంతో కేవలం 19 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మార్కు దాటిన బ్యాటర్ రికార్డు నమోదు చేశాడు.
అదేవిధంగా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా కూడా వార్నర్ మరో రికార్డు నెలకొల్పాడు. వార్నర్ కంటే ముందు రికీ పాంటింగ్ (1743 పరుగులు), అడమ్ గిల్‌క్రిస్ట్ (1085 పరుగులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
అంతకుముందు ఈ రికార్డు భారత లిటిల్ మాస్టర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 20 ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా 20 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మార్క్‌ను దాటి సచిన్ రికార్డును సమం చేశాడు. ఇప్పుడు వార్నర్ వారి రికార్డును బద్దలుకొట్టాడు. ఇక 21 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులను దాటిన వివ్ రిచర్డ్స్, సౌరవ్ గంగూలీ, 22 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మార్క్ దాటి మార్క్ వా, హర్షలే గిబ్స్ వారి తర్వాత స్థానాల్లో ఉన్నారు.