హైదరాబాద్: టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన అయిదవ క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్(David Warner) నిలిచాడు. ఆ జాబితాలో అతను విరాట్ కోహ్లీని దాటేశాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న వార్నర్.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆ మైలురాయిని అందుకున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో వార్నర్ 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దాంట్లో అయిదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. 148.73 స్ట్రయిక్ రేట్‌తో అతను స్కోరింగ్ చేశాడు.
వార్నర్ 373 మ్యాచుల్లో 12,195 పరుగులు స్కోర్ చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 37.17గా ఉన్నది. ఇక స్ట్రయిక్ రేట్ 140.22గా ఉంది. దీంట్లో 8 సెంచరీలు, 102 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 135 రన్స్. ఇక విరాట్ కోహ్లీ 379 మ్యాచుల్లో 12,175 రన్స్ చేశాడు. అతని యావరేజ్ 41.55గా ఉంది. స్ట్రయిక్ రేట్ 133.54గా నమోదు అయ్యింది. కోహ్లీ ఖాతాలో 8 సెంచరీలు, 93 ఫిఫ్టీలు ఉన్నాయి. అతని బెస్ట్ స్కోర్ 122.
టీ20 క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ ఉన్నాడు. అతను 463 మ్యాచుల్లో 14,562 రన్స్ చేశాడు. అతని యావరేజ్ 36.22గా ఉంది. స్ట్రయిక్ రేట్ 144.75గా ఉంది. గేల్ తన కెరీర్లో 22 సెంచరీలు, 88 ఫిఫ్టీలు చేశాడు. ఉత్తమ స్కోరు 175 రన్స్.