Iga Swiatek : డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో రెండోసీడ్ ఇగా స్వియటెక్(Iga Swiatek) జోరు కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ గ్రూప్ దశ మ్యాచ్‌లో ఈ పోలండ్ ప్లేయర్ మూడో ర్యాంకర్ కొకో గాఫ్‌ను చిత్తు చేసింది. 89 నిమిషాల్లో 6-0, 7-5తో అమెరికా టీనేజర్‌ను ఓడించింది. దాంతో.. యూఎన్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించిన గాఫ్ నిరాశే మిగిలింది.
‘రెండో సెట్లో గట్టి పోటీ ఎదురైంది. అయినా సరే కంగారుపడకుండా ఆటపై దృష్టి పెట్టాను. గాఫ్ ఫస్ట్ సర్వీస్‌ను బ్రేక్ చేసేందుకు నాకు చాలా చాన్స్‌లు వచ్చాయి. వాటిలో ఒక అవకాశాన్ని ఉపయోగించుకుంటానని నాకు తెలుసు’ అని స్వియాటెక్ మ్యాచ్ అనంతరం తెలిపింది. అక్టోబర్‌లో బీజింగ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో స్వియటెక్, గాఫ్ తలపడ్డారు. అయితే.. కుడి భుజానికి గాయం కారణంగా గాఫ్ ఆట నుంచి తప్పుకుంది.
ఈ విజయంతో స్వియాటెక్ నంబర్ 1 ర్యాంకుకు మరింత చేరువైంది. ప్రస్తుతం అరినా సబలెంక(Aryna Sabalenka) టాప్ సీడ్లో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో ట్యునీషియా సంచలనం ఓన్స్ జుబెర్.. వింబుల్డన్ విజేత మార్కెట ఒండ్రుసోవాకు ఝలక్ ఇచ్చింది. 6-4, 6-3తో గెలుపొంది వింబుల్డన్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.