Ramiz Raja : కొన్ని గంటల్లో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్‌దే గెలుపని విశ్లేషకులు చెబుతున్నారు. బలమైన బ్యాటింగ్ లైనప్‌తో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. పాకిస్థాన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇలాంటి తరుణంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ రమీజ్ రజా (Ramiz Raja) కీలక వ్యాఖ్యలు చేశారు. అంచనాలు లేకుండా బరిలోకి దిగడం అంతిమంగా పాకిస్థాన్‌కు అనుకూలంగా మారవచ్చని అన్నాడు. ముందుగా శుభ్‌మాన్ గిల్‌ను టార్గెట్ చేయాలని పాకిస్థాన్ ప్లేయర్లకు సూచించారు.
‘భారత్ టాప్ ఆర్డర్లో బలహీనతలు, బౌలింగ్‌లో జరిగిన మార్పులు తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందని రమీజ్ రజా అభిప్రాయపడ్డారు. ఈ టోర్నీలో భారత్ ఖాతాలో ఇప్పటికే ఓ విజయం ఉంది. తొలి గేమ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించారు. పాక్ విజయం కోసం తపిస్తోంది. పెద్దగా అంచనాలేవీ లేకుండానే బరిలోకి దిగుతోంది. అయితే ఇది అంతిమంగా పాక్‌కు లాభించొచ్చు. ఇది పాక్‌కు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం కల్పించింది’ అని అన్నారు.
తొలి గేమ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తరువాత పాకిస్థాన్‌కు భారత్‌పై గెలుపు అనివార్యంగా మారింది. ఓడిన పక్షంలో పాక్ ఏకంగా టోర్నీ నుంచే తప్పుకోవాల్సి రావచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం పాక్‌కు కలిసొస్తుందని, ఈ సమయంలో గిల్‌ను త్వరగా అవుట్ చేయగలిగితే విజయం పాక్‌ను వరిస్తుందని రమీజ్ రాజా చెప్పారు. స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ సింగిల్స్ స్కోర్ చేయడంలో భారత్ తడబడుతోందని అన్నారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 145 బంతులకు పరుగులేవీ రాక వృథాగా మారిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
‘పాకిస్థాన్ టాప్ ఆర్డర్ క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. రిస్క్ తీసుకునేందుకు జంకుతుంది. ఔటవుతామన్న భయంలో ఉంటుంది. ఈ భయమే వారిని భారీ లక్ష్యాలు ఏర్పాటు చేసేందుకు, ఛేదనలో దూసుకుపోయేందుకు అడ్డంకిగా మారుతోంది’ అని రజా అన్నారు. పాక్ బౌలర్లపై కూడా రజా విమర్శలు గుప్పించారు. ఒత్తిడికి నిలదొక్కుకోవడం, యార్కర్లు, స్లో బౌన్సర్లు, ఇతర రకాల బౌలింగ్ మార్పులతో ప్రత్యర్థులను తికమకపెట్టే పదునైన వ్యూహం పాక్ బౌలర్లలో కొరవడిందని వ్యాఖ్యానించాడు.