Sunil Gavaskar | భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇరుజట్లు ఒకే రోజు 15 వికెట్లు కోల్పోయాయి. దీనిపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశ్నలు సంధించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు ఎప్పుడూ భారత్‌లో పిచ్, పరిస్థితులపై మాట్లాడుతారని.. తాము మాత్రం దేని గురించి ఫిర్యాదు చేయలేదని గవాస్కర్ చురకలంటించారు.
సిడ్నీలో శుక్రవారం మ్యాచ్ మొదలు కాగా.. తొలిరోజు వికెట్ నష్టానికి ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. రెండోరోజు తొమ్మిది వికెట్లను కోల్పోయింది. అయితే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌట్ చేశారు. దాంతో టీమిండియా నాలుగు పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా సైతం.. బ్యాటింగ్‌లో తడబడింది. రిషబ్ పంత్ తప్ప మరెవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండోరోజు రెండు జట్లు కలిసి మొత్తం 15 వికెట్లు కోల్పోయాయి.
సిడ్నీ మ్యాచ్ రెండోరోజు 15 వికెట్లు పడడంపై మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ తీవ్రంగానే స్పందించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లకు సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. మ్యాచ్ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లు ఎప్పుడూ భారత్‌లోని పిచ్‌లు, పరిస్థితులపై మాట్లాడుతుంటారని గుర్తు చేశారు. తాము పంచాయితీలకు పోవడం లేదని.. ఇలాంటి విషయాలపై ఎప్పుడూ ఫిర్యాదు చేయడం చూసి ఉండరని గవాస్కర్ పేర్కొన్నారు.
కానీ, భారత్‌లో ఒకే రోజు 15 వికెట్ల పడితే మాత్రం భూకంపం వచ్చేదంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. భారత్‌లో టెస్టు మ్యాచులు త్వరగా ముగిసిన నేపథ్యంలో పలువురు మాజీలు ప్రశ్నించిన వైనాన్ని ఈ సందర్భంగా గవాస్కర్ గుర్తు చేశారు. భారత్‌లోని పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తుంటాయి. ఈ క్రమంలో స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇబ్బందిపడుతుంటారు. ఈ క్రమంలో భారత్‌లో పలుసార్లు టెస్టులు మూడు నాలుగు రోజుల్లోనే ముగిసిన సందర్భంలో పిచ్‌పై ఫిర్యాదు చేసిన దాఖలు ఉన్నాయి. ఈ నేపథ్యం సన్నీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.