ముంబై : సినిమాల్లో తనదైన నటనతో అభిమానులను అలరించే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు గ్రామాల్లో ఒకప్పుడు పిల్లలు ఆడే దొంగా పోలీస్, గోళీలు, హైడ్ అండ్ సీక్ వంటి ఆటలంటే చాలా ఇష్టమట. ఇటీవల కాలంలో ప్రతి క్రీడకు సంబంధించి ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో తాను గనక ఏదైనా లీగ్‌ను ప్రారంభిస్తే చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్‌తోనే చేస్తానని సల్లూ భాయ్ అన్నాడు.
ముంబైలో జరిగిన వరల్డ్ ప్యాడెల్ లీగ్ మూడో సీజన్ ప్రారంభం సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ నేను ఏదైనా లీగ్‌ను ప్రారంభించాలనుకుంటే.. గోళీల లీగ్, గిల్లీదండ లీగ్, దొంగా పోలీస్ లీగ్, హైడ్ అండ్ సీక్, డాక్టర్-డాక్టర్ వంటి లీగ్‌లను స్టార్ట్ చేస్తా’ అని చెప్పడంతో సభలో నవ్వులు విరబూశాయి. సల్మాన్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవడంతో పలువురు నెటిజన్లు తమ చిన్నప్పటి క్రీడలను గుర్తుకు తెచ్చినందుకు గాను ఈ సికిందర్ హీరోకు కృతజ్ఞతలు చెబుతున్నారు.