న్యూఢిల్లీ: టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ రాహుల్ ద్రావిడ్ వారసత్వాన్ని గంభీర్ తీసుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ తర్వాత ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రావిడ్ వైదొలగనున్నాడు. అతని కాంట్రాక్టు ముగుస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు కొత్త కోచ్‌ను ఎంపిక చేయడం అనివార్యమైంది. దీని కోసం ఇటీవల బీసీసీఐ దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. అయితే రాహుల్ ద్రావిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ వస్తారని కొన్ని మీడియా కథనాలు వ్యాపిస్తున్నాయి. దీనిపై మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)ని ప్రశ్నించారు. ఇండియన్ కోచ్‌ను తాను కూడా ప్రిఫర్ చేస్తానని, ఒకవేళ గంభీర్ కనుక దరఖాస్తు చేసుకుని ఉంటే, అతను ఓ మంచి కోచ్ అవుతాడని గంగూలీ పేర్కొన్నాడు.
ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లయ్ చెయిన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న గంగూలీ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్‌కప్ గెలిచే సత్తా భారత్‌కు ఉందని అన్నారు. వరల్డ్‌కప్ గెలిచే అవకాశాలు భారత్‌కు మెరుగ్గా ఉన్నాయని, టీ20 జట్టు తరహాలో ఇండియా ఆడాలని, అద్భుతమైన ట్యాలెంట్ ఉందని గంగూలీ పేర్కొన్నాడు.