కటక్: టీమిండియా క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler). కటక్‌లో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. ఆ వన్డేలో ఇండియా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ఇటీవల పెద్దగా స్కోర్లు చేయలేకపోయిన రోహిత్ శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ దశలో వత్తిడి తట్టుకోలేక.. ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రోహిత్ ఆడలేకపోయాడు. దీంతో అతని కెరీర్ ముగిసిందేమో అన్న ఊహాగానాలు వినిపించాయి. రోహిత్‌ను తప్పించాలని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. కానీ ఎట్టకేలకు రోహిత్ శర్మ తన ఫామ్ చేజిక్కించుకున్నాడు. కటక్ వన్డేలో దుమ్మురేపాడు. 37 ఏళ్ల స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆడిన తీరుపై బట్లర్ ప్రశంసలు కురిపించాడు.
16 నెలల విరామం తర్వాత వన్డేలో రోహిత్ ఫస్ట్ సెంచరీ కొట్టాడు. రోహిత్ శర్మ లాంటి సామర్థ్యం ఉన్న ఆటగాళ్లే వత్తిడికి లోనవుతే, ఇతర ఆటగాళ్లు ఆ అంశాన్ని ఓ అనుభవంగా తీసుకోవాలని బట్లర్ పేర్కొన్నాడు. ఆధునిక క్రికెట్, వన్డే బ్యాటింగ్‌లో రోహిత్ ఇన్నింగ్స్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రోహిత్ శర్మ గొప్ప ప్లేయర్ అని, చాన్నాళ్ల నుంచి అతను మేటి క్రికెట్ ఆడుతున్నాడని, టాప్ ప్లేయర్లు ఏదో దశలో మళ్లీ ఉత్తమంగా రాణిస్తారని, ఇవాళ అతను అదే చేశాడని బట్లర్ తెలిపాడు. ఎప్పుడైనా గొప్ప ఆటగాళ్లతో ఆడుతున్నప్పుడు.. అలాంటి ఆటగాళ్లు గొప్ప ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు.. నాకు తెలిసి ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు అనుభవ పాఠాలు నేర్చుకుంటారని భావిస్తున్నట్లు బట్లర్ పేర్కొన్నాడు. రోహిత్ అత్యద్భుత ఇన్నింగ్స్ ఆడాడని, వత్తిడిని ఎలా ఎదుర్కోవాలో అతను చూపించాడని, ప్రత్యర్థులను వత్తిడిలోకి నెట్టేశాడని బట్లర్ తెలిపాడు.
రోహిత్ సామర్థ్యాన్ని విశేషంగా మెచ్చుకున్న బట్లర్… తనకు లెర్నింగ్ ఎక్స్పీరియస్ అయ్యిందన్నారు. ఈ రోజుల్లో, ఆ వయసులో, 50 ఓవర్ల క్రికెట్ ఆడుతూ.. రోహిత్ డైనమిక్‌గా కనిపించాడని, చాలా దూకుడు ఇన్నింగ్స్ ఆడాడని, స్కోరింగ్ రేట్ అమోఘంగా ఉందని, మ్యాచ్‌లు గెలవాలంటే అలాంటి ఇన్సింగ్స్ ఆడాల్సిందే అని బట్లర్ తెలిపాడు. మేం ఆడాలనుకున్న రీతిలో రోహిత్ ఆడినట్లు చెప్పాడు. కటక్ వన్డేలో రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 రన్స్ చేశాడు. దాంట్లో ఏడు సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి.