U-19 World Cup | మలేషియా వేదికగా జరుగుతున్న అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించింది. శ్రీలంకపై 60 పరుగులతో విజయం సాధించింది. మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ గొంగాడి త్రిష బ్యాటింగ్‌తో పాటు బౌలర్లు సైతం రాణించడంతో బౌలర్లు రాణించడంతో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో త్రిష 44 బంతుల్లో ఐదు ఫోర్లు, ఇక సిక్సర్ సహాయంతో 49 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ జీ కమలిని 5 పరుగులకే అవుట్ అయ్యింది. ఆ తర్వాత సానికా చల్కే డకౌట్‌గా వెనుదిరిగింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరో వైపు మరో ఓపెనర్ త్రిష లంక బౌలర్లును ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో మిథిలా వినోద్ (10 బంతుల్లో 16), వీజే జోషిత (తొమ్మిది బంతుల్లో 14) చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేశారు.
దాంతో నిర్ణీత 20 ఓవర్లలో యువ భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ప్రముది మేథ్సార, లిమాన్స తిలకరత్న, అసేని తలగుణేకు తలో రెండు వికెట్లు తీయగా.. చమోది ప్రబోధ, నాయక్కర, రష్మికకు తలో వికెట్ దక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన లంక జట్టు పెవిలియన్‌కు క్యూ కట్టింది. టీమిండియా బౌలింగ్ ధాటికి శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 58 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాట్వుమెన్స్కు బౌలర్లు ఏ దశలోనూ పరుగులు చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. వీజే జోషిత, షబ్నమ్, పారుణిక సిసోడియాకు తలో రెండు వికెట్లు దక్కగా.. ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మకు తలో వికెట్ పడగొట్టారు. శ్రీలంక బ్యాటర్స్‌లో రష్మిక 15 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. టీమిండియా ఈ నెల 26న సూపర్ సిక్స్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనున్నది. రెండో మ్యాచ్‌ను 28న నెదర్లాండ్తో ఆడనున్నది.