దుబాయ్: టీమ్ఇండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం ప్రకటించిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో బిష్ణోయ్ 699 పాయింట్లతో ఐదు ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్(692)ను రెండో ర్యాంక్‌కు పరిమితం చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో రవి బిష్ణోయ్ తొమ్మిది వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (855) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (688) ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా (204) మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.