ముంబై: టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)లో భాగంగా భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు చెందిన వేదికలను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఐసీసీ, బీసీబీ మధ్య వర్చువల్ కాల్ జరిగింది. బంగ్లాదేశ్ చేసిన విన్నపాన్ని తిరస్కరించిన విషయం గురించి బోర్డుకు చెప్పినట్లు ఐసీసీ పేర్కొన్నది. వరల్డ్‌కప్‌లో ఆడాలంటే భారత్‌కు పర్యటించాల్సిందే అని, లేదంటే కీలకమైన పాయింట్లను కోల్పోతారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం లేదు.
వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7వ తేదీన వెస్టిండీస్‌తో ఆడనున్నది. ఆ మ్యాచ్ కోల్‌కతాలో జరగాల్సి ఉన్నది. ఆ తర్వాత ఇంగ్లండ్, నేపాల్‌తో ఆడనున్నది. భద్రతా దృష్ట్యా భారత్‌లో పర్యటించమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెప్పింది. ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి ఘటనలు పెరిగిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు బలహీనపడ్డాయి. హిందువుల హత్యలను నిరసిస్తూ ఐపీఎల్ నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను తొలగించారు. దీంతో సమస్య మరింత జటిలమైంది.