Mitchell Starc: ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2024 వేలంలో ఎవరూ ఊహించనంతగా, ఇంతకుమునుపు ఎప్పుడూ లేనంత విధంగా ఏకంగా రూ. 24.75 కోట్లను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఏడేండ్లుగా ఈ లీగ్ ఆడని స్టార్క్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. అతడిని దక్కించుకునేందుకు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ పోటీలోకి వచ్చినా ఆఖరికి కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ ధరతో అతడిని సొంతం చేసుకుంది. 2015 సీజన్లో చివరిసారిగా ఐపీఎల్ ఆడిన స్టార్క్.. ఇన్నాళ్లూ ఈ లీగ్‌కు ఎందుకు దూరంగా ఉన్నాడనేదానిపై తాజాగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
స్టార్క్ స్పందిస్తూ… ‘టెస్టు క్రికెట్‌కే నా మొదటి ప్రాధాన్యం. టెస్టులతో పాటు ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు నేను అధిక ప్రాధాన్యమిచ్చా. ఇన్నాళ్లూ ఐపీఎల్ లో ఆడనందుకు నేనేమీ చింతించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే నేను ఐపీఎల్ నుంచి దూరంగా ఉండటం వల్ల టెస్టులలో నా ఆట కూడా మెరుగుపడింది. ఈ విషయం నేను గతంలో ఇదివరకే ఒకసారి చెప్పాను. రెడ్ బాల్ క్రికెట్టే నాకు ఎప్పుడూ టాప్ ప్రియారిటీ. రాబోయే ఏడాదిలో టీ20 వరల్డ్ కప్‌లో సిద్ధమయ్యేందుకు ఐపీఎల్ నాకు దోహదం చేస్తుందని భావిస్తున్నా…’ అని తెలిపాడు.