Yograj Singh | భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన పలువురిపై సంచనల ఆరోపణలు చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితం ముగిసిపోయిందని.. తాను చచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ స్టూడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఆహారం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేకుండా ఒంటరిగా కూర్చుంటానని.. ఆహారం కోసం అపరిచితులపై ఆధారపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఒకసారి ఒకరు.. మరోసారి ఇంకొకు ఆహారాన్ని అందిస్తున్నారన్న ఆయన.. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టనన్నారు. ఆకలిగా ఉన్నప్పుడు ఎవరో తనకు భోజనం ఇచ్చి వెళ్తారన్నారు. తనకు ఇంట్లో సేవలుకులు, వంటవారు ఉన్నా.. వారి పని వారు చేసుకొని వెళ్లిపోతారన్నారు. తాను కుటుంబాన్ని చాలా ప్రేమిస్తానని.. కానీ ఎవరిని సహాయం అడుగనన్నారు.
నా తల్లి, పిల్లలు, కోడలు, మనవరాళ్లు, నా కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ తాను ప్రేమిస్తున్నానని.. వారంతా తనతో ఎందుకు ఉండడం లేదో తెలియదన్నారు. తనది పరిపూర్ణ జీవితమని.. జీవితంలో అనుభవించేది.. సాధించాల్సింది ఇంకా ఏమీ లేదని.. తాను చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. దేవుడు తనను ఎప్పుడు కావాలంటే అప్పుడు తనతో తీసుకెళ్లగలడని.. తాను దేవుడికి కృతజ్ఞుడనన్నారు. 62 ఏళ్ల యోగ్రాజ్ సింగ్ ఆయన భార్యతో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో యువరాజ్ వయసు 17 సంవత్సరాలు. ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపారు. ఒంటరిగా మిగిలిపోవడానికి ఏం చేశానో తనకు ఇంకా అర్థం కావడం లేదన్నారు. యూవీ, అతని తల్లి తనను విడిచి వెళ్లే పరిస్థితులు వచ్చిన సమయంలో ఎంతో ఇబ్బందులుపడ్డానని.. తన జీవితం, యవ్వనాన్ని ఆమెకు అంకితం చేశానని.. అలాంటి స్త్రీ తనను ఎలా విడిచిపెట్టగలదు? అంటూ ఆయన ప్రశ్నించారు.
అందరికీ ప్రతిదీ సరిగ్గా చేసిన సమయంలో ఇలా ఎందుకు జరిగిందని దేవుడిని అడిగానన్నారు. తాను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చని.. తాను ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదన్నారు. తాను దేవుడి ఎదుట ఏడ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్ అయిన యోగరాజ్ సింగ్ తొలుత షబ్నమ్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. షబ్నమ్ ఇద్దరు కుమారులు యువరాజ్, జోరావర్‌కు జన్మనిచ్చింది. యోగ్రాజ్, షబ్నమ్ మధ్య విభేదాలతో విడిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరు గొడవలు పడుతున్నందున విడాకులు తీసుకోవాలని సూచించినట్లుగా యువరాజ్ స్వయంగా వెల్లడించాడు. అయితే, యోగ్రాజ్ ఇంకా మాట్లాడుతూ ఇది దేవుడు ఆడిస్తున్న ఆట మాత్రమేనని.. తాను తీవ్రమైన కోపం, బాధలో ఉన్న సమయంలో ఆ సమయంలో క్రికెట్ తన జీవితంలోకి వచ్చి ఆగిపోయిందన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానని.. కానీ వృద్ధాప్యంలో నాకు ఎవరూ తోడుగా లేరన్నారు. తాను ఎక్కడైతే మొదలు పెట్టానో మళ్లీ అక్కడికే వచ్చానంటూ వాపోయారు. షబ్నమ్తో విడాకుల తర్వాత ఆయన సత్బీర్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు సంతానం. వీరితో ఆయన కలిసి ఉండడం లేదు. ప్రస్తుతం, కూతురు, కొడుకు అమెరికాలో స్థిరపడ్డారు. వారితో ఆయన కలిసి ఉండకపోవడానికి మాత్రం కారణాలు తెలియరాలేదు.