న్యూఢిల్లీ : హైదరాబాద్ యువ క్రికెటర్ వుట్కూరి యశ్వీర్ గౌడ్ భారత అండర్ -19 జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే నెల శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం జూనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం ప్రకటించిన జట్టులో 18 ఏండ్ల ఆల్‌రౌండర్ యశ్వీర్ చోటు దక్కించుకున్నాడు. హెచ్‌సీఏ పరిధిలో లోకల్ లీగ్స్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్న యశ్వీర్ సెలెక్టర్లను మెప్పించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గానే కాకుండా బ్యాట్‌తోనూ మ్యాచ్‌లను మలుపు తిప్పగల సత్తా ఉన్న ఈ హైదరాబాద్ కుర్రాడు తొలిసారి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను నిరూపించుకునేందుకు గోల్డెన్ చాన్స్ దక్కించుకున్నాడు. ఇటీవల జరిగిన టీజీ20 లీగ్ వేలంలో హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టు యశ్వీర్ను రూ.3 లక్షలకు సొంతం చేసుకుంది.
మరోవైపు టీమిండియా మాజీ గ్రేట్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ వికెట్ కీపర్‌గా అండర్-19 జట్టుకు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. జూనియర్ లెవెల్ క్రికెట్లోనిలకడైన ప్రదర్శనతో దూసుకుపోతున్న అన్వయ్.. తొలిసారి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఇప్పటికే ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుతుండగా, ఇప్పుడు చిన్న కుమారుడు అన్వయ్ కూడా భారత జెర్సీ ధరించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంక పర్యటనలో భారత్ జూలై 4, 6, 9వ తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత రెండు మల్టీ డే (నాలుగు రోజుల) మ్యాచ్‌ల్లో పాల్గొంటుంది. ఈ రెండు జట్లకూ యశ్వర్ధన్ సింగ్ చౌహాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మరోవైపు ఈ నెల చివర్లో భారత పర్యటనకు వచ్చే శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన అండర్-19 మహిళల జట్టులో హైదరాబాద్ క్రికెటర్ వి. ప్రతీక్ష చోటు దక్కించుకుంది.