హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీఐఎస్సీఈ జాతీయ గేమ్స్‌లో హైదరాబాద్ యువ అథ్లెట్ రాగవర్షిణి సత్తాచాటింది. పుణెలోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన జాతీయ మీట్లో సెయింట్ జోసెఫ్ స్కూల్‌కు చెందిన రాగవర్షిణి మూడు స్వర్ణాలు సహా రజత పతకంతో మెరిసింది. టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన వర్షిణి బాలికల 100 మీటర్ల రేసును 13.33 సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని ముద్దాడింది. అదే జోరు కొనసాగిస్తూ 200 మీటర్ల పరుగు పందెంలో 27.15 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. 400 మీటర్ల స్ప్రింట్‌లో 1:05:77 సెకన్లతో ముచ్చటగా మూడో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. బాలికల 4X100 మీటర్ల రిలేలో వర్షిణి రెండో స్థానంతో రజతం దక్కించుకుంది. మరోవైపు తెలంగాణకే చెందిన లక్ష్మి ప్రసన్న 3000మీటర్ల నడక రేస్‌లో స్వర్ణం సాధించింది.