‘కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు..మహా పురుషులు అవుతారు’ అని పెద్దలు ఊరికే అనలేదు. కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా ఉంటుంది. చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న యువకుడు దేశం తరఫున ప్రపంచకప్ ఆడబోతున్నాడు. అతను మరెవరో కాదు రాజన్న సిరిసిల్ల జిల్లా పోత్గల్ గ్రామానికి చెందిన ఎరవల్లి అవినాశ్రావు. ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన యువ భారత్ జట్టుకు ఎంపికయ్యాడు. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న అవినాశ్ ప్రతిభకు జాతీయ సెలెక్టర్లు పట్టం కట్టారు. వికెట్‌కీపర్, బ్యాటర్‌గా అదరగొడుతున్న అవినాశ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
Avinash Rao | రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 14: వస్త్ర పరిశ్రమలో దేశవ్యాప్త ఖ్యాతి గడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ పోటీల్లోనూ అంతర్జాతీయ కీర్తి కెక్కనున్నది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీకి ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన యువ క్రికెటర్ ఎరవల్లి అవినాశ్రావు వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. మెగాటోర్నీకి ఎంపిక కావడంపై అతన్ని అభినందిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ట్వీట్ చేశారు.
ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన ఎరవల్లి లక్ష్మణ్‌రావు, సుష్మ హైదరాబాద్‌లో ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. 20 ఏండ్ల క్రితం వీరు కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వలసపోయి అక్కడే స్థిరపడ్డారు. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు అవినాశ్రావు 5వ తరగతి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. చదువుకుంటూనే స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేవాడు. ఇంటర్లో ఓ ప్రైవేటు కళాశాలలో చేరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నాడు. ఆటలో రాణిస్తున్న అవినాశ్‌ను హెచ్‌సీసీ గుర్తించింది. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అవకాశం కల్పించింది. అందులోనూ ఆయన తన ప్రతిభ చూపాడు. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ టోర్నీలో యువ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అవినాశ్ తల్లిదండ్రులు ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉన్నారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న అండర్-19 ప్రపంచ క్రికెట్ పోటీలకు బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి అవినాశ్‌తో పాటు మురుగన్ అభిషేక్ కూడా ఎంపికయ్యాడు. ప్రపంచకప్‌లో పోత్గల్ యువకుడు ఆడనున్న నేపథ్యంలో జిల్లా వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అండర్-19 ప్రపంచకప్‌తో పాటు దక్షిణాఫ్రికా ముక్కోణపు సిరీస్‌కు ఎంపికైన ఎరవల్లి అవినాశ్రావుకు హృదయపూర్వక అభినందనలు. అద్భుత ప్రతిభ కల్గిన ఈ క్రికెటర్ మన రాజన్న సిరిసిల్ల పోత్గల్‌కు చెందిన యువకుడు కావడం విశేషం.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్