హైదరాబాద్: టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) మూడో సీజన్లో హైదరాబాద్ స్ట్రైకర్స్ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 49-31 తేడాతో ముంబై లియాన్ ఆర్మీపై అద్భుత విజయం సాధించింది. తొలుత జరిగిన మ్యాచ్‌లో హైదరాబాదీ యువ ప్లేయర్ కర్మాన్‌కౌర్ 15-5 తేడాతో సౌజన్య భవిశెట్టిపై ఘన విజయం సాధించింది. ఇదే జోరు కొనసాగిస్తూ.. హైదరాబాద్ తరఫున అర్జున్ ఖడే 12-8తో రామ్‌కుమార్ రామనాథన్‌పై అలవోకగా గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ పోరులో స్ట్రైకర్స్ జోడీ విష్ణువర్ధన్-కర్మాన్‌కౌర్ 11-9తో ముంబై ద్వయం నికీ పునాచ-సౌజన్యపై గెలిచింది. ఆఖరిదైన పురుషుల డబుల్స్‌లో విష్ణు-అర్జున్(హైదరాబాద్) 11-9తో రామ్‌కుమార్-నిక్కీ(ముంబై)పై గెలువడంతో స్ట్రైకర్స్ విజయం పరిపూర్ణమైంది. ముగింపు కార్యక్రమానికి హైదరాబాద్ ఫ్రాంచైజీ సహయజమాని ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌సింగ్‌తో పాటు బ్రిజ్గోపాల్ హాజరయ్యారు.