బంతి దొరికితే బౌండరీ లైన్ అవతలకు బాదుదామన్నంత కసిమీద ఉన్న బ్యాటర్లకు పసలేని బౌలర్లు తగిలితే ఎలా ఉంటుంది..? అదీ ‘చిన్నస్వామి’ వంటి బ్యాటింగ్ పిచ్‌లో అయితే ఇంకేమైనా ఉందా..? ఆ విధ్వంసానికి పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. బెంగళూరులో సోమవారం రాత్రి బౌలర్ల పరిస్థితి అదే అయింది. ఒకరిని మించి ఒకరు ప్రత్యర్థి జట్ల బౌలర్లపై బ్యాటర్లలా కాదు ఆకలిగొన్న మృగాల్లా విరుచుకుపడటంతో చిన్నస్వామిలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. సన్‌రైజర్స్ తరఫున ట్రావిస్ హెడ్.. 39 బంతుల్లోనే తుఫాను వేగంతో సెంచరీ చేస్తే హెన్రిచ్ క్లాసెన్ పిడుగులా పడ్డాడు. దీంతో ఈ సీజన్లో హైదరాబాద్ రెండోసారి రికార్డు స్కోరు(287/3) నమోదుచేస్తే బౌలింగ్‌లో పస లేకున్నా బెంగళూరు బ్యాట్‌తో ధాటిగానే బదులిచ్చింది. డుప్లెసిస్, కోహ్లీ బాదుడుకు శ్రీకారం చుడితే లేటు వయసులో దినేశ్ కార్తీక్ నభూతో నభవిష్యత్ అన్న రేంజ్లో పోరాడాడు. ఫలితం హైదరాబాద్‌కు అనుకూలంగా వచ్చినా బౌలర్లు బాధితులుగా మారిన ఈ మ్యాచ్‌లో ప్రేక్షకులు సిక్సర్లు (38), ఫోర్ల (43) హోరువానలో తడిసి ముద్దయ్యారు. టీ20 ప్రపంచ చరిత్రలో ఇరు జట్లూ కలిపి 549 పరుగులు నమోదుచేయడం విశేషం.
IPL | బెంగళూరు: ఐపీఎల్లో ఇదివరకే ఉప్పల్‌లో ఈ లీగ్‌లో అత్యధిక స్కోరు నమోదుచేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరోసారి రెచ్చిపోయింది. మూడు వారాల వ్యవధిలో తన రికార్డు (277)ను తానే అధిగమిస్తూ అత్యధిక స్కోరు (287/3)ను సాధించింది. బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ హైదరాబాద్ (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.
ట్రావిస్ హెడ్ (41 బంతుల్లో 102, 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67, 2 ఫోర్లు, 7 సిక్సర్లు) దంచికొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ కూడా ఎక్కడా తగ్గలేదు. 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసి విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచింది. దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83, 5 ఫోర్లు, 7 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62, 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (20 బంతుల్లో 42, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కింది.
మోన్స్టర్ క్లాసెన్
‘మాలో నుంచి ఎవడన్న బయటకు పోయిండనుకో. బిక్షు యాదవ్ వస్తాడు. ఆయన వచ్చాక బాల్‌తో కాదు. మీతో ఆడుకుంటడు’ అంటూ క్లాసెన్ గురించి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సై సినిమాలో వైరల్ చేస్తున్న డైలాగ్ క్లాసెన్ చెవిన పడిందో ఏమో గానీ హెడ్ ఔట్ అవడంతోనే చిన్నస్వామిలో క్లాసెన్ షో మొదలైంది. దీంతో తీవ్ర ఆకలి మీదున్న పులికి జింకల మంద దొరికినట్టుగా అయింది ఆర్సీబీ బౌలర్ల పరిస్థితి. క్రీజులోకి వచ్చేప్పుడే ‘మినిమం సిక్స్’ అని మైండ్‌లో ఫిక్స్ అయ్యాడేమో ఏమో గానీ క్లాసెన్.. సిక్సర్ తప్ప సింగిల్స్ జోలికి వెళ్లలేదు.
అతడు 67 పరుగులు చేస్తే అందులో 42 పరుగులు సిక్సర్ల రూపంలో వచ్చినవే. క్లాసెన్ బాదుడుకు భయపడి 14వ ఓవర్ వేసిన మహిపాల్ లోమ్రర్.. నాలుగు వైడ్లు వేసి ‘హమ్మయ్యా నా ఓవర్ అయిపోయింది’ అనుకున్నాడు. ఆ తర్వాత బాధితులు విజయ్‌కుమార్, ఫెర్గూసన్. ఈ విధ్వంసంతో హైదరాబాద్ స్కోరు 15 ఓవర్లకే 200 దాటింది. ఫెర్గూసన్ 17వ ఓవర్లో క్లాసెన్ కొట్టిన 106 మీటర్ల సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్. ఇదే ఓవర్లో క్లాసెన్.. వైశాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. హెడ్, క్లాసెన్‌లు డగౌట్లో ఉన్నా జమ్మూ కుర్రాడు అబ్దుల్ సమద్‌తో కలిసి మార్క్మ్ సన్‌రైజర్స్‌కు రికార్డు స్కోరును కట్టబెట్టాడు. టాప్లీ 19వ ఓవర్లో సమద్.. 4,4,6,6,4తో రెచ్చిపోతే ఆఖరి ఓవర్లో మార్క్మ్ 4,6తో హైదరాబాద్.. ఈ సీజన్లో తమ రికార్డు (277)ను తామే బద్దలుకొట్టింది.
డుప్లెసిస్, కోహ్లీ తప్ప..
రికార్డు ఛేదనను బెంగళూరు ధాటిగానే ఆరంభించింది. 6 ఓవర్లకే ఆ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. కోహ్లీ, డుప్లెసిస్‌లు పవర్ ప్లేలో తమదైన షాట్లతో పవర్ చూపించారు. భువనేశ్వర్, షాబాజ్, నటరాజన్ బౌలింగ్‌లో ఈ ఇద్దరూ చూడచక్కని షాట్లతో అలరించారు. కానీ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మయాంక్ మార్కండే.. 7వ ఓవర్లో రెండో బంతికి కోహ్లీని క్లీన్‌బౌల్డ్ చేసి ఆర్సీబీ పతనానికి కొబ్బరికాయ కొట్టాడు.
ఖతం.. కోహ్లీ పెవిలియన్ చేరగానే ఆర్సీబీ తర్వాతి బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. విల్ జాక్స్ (7) రనౌట్ కాగా రజత్ పాటిదార్ (9) మయాంక్ బౌలింగ్‌లో నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కమిన్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి బెంగళూరు బెంగను మరింత పెంచాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేసుకున్న డుప్లెసిస్.. పదో ఓవర్ మూడో బంతికి క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా ఆఖరి బంతికి సౌరవ్ చౌహన్ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు.
హెడ్.. దిమ్మ తిరిగేలా!
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ గురించి స్థూలంగా చెప్పాలంటే ఆర్సీబీ బౌలర్లను ట్రావిస్ హెడ్ ఊచకోత కోస్తే.. హెన్రిచ్ క్లాసెన్ ఉప్పెనలా విరుచుకుపడగా.. మేమేమైనా తక్కువ తిన్నామా అంటూ సమద్(37 నాటౌట్), మార్క్మ్(్ర32 నాటౌట్)లు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. టాస్ గెలిచాక బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ హైదరాబాద్‌కు బ్యాటింగ్‌కు అప్పగించాడు. కానీ అతడు ఎంత పెద్ద తప్పు చేశాడో తెలియడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. రెండో ఓవర్ నుంచే హెడ్ ఆర్సీబీ బౌలర్లను వెంటాడాడు. టాప్లీ రెండో ఓవర్లోనే 4,6తో బాదుడుకు శ్రీకారం చుట్టాడు.
సిరాజ్ స్థానంలో వచ్చిన ఫెర్గూసన్ వేసిన 5వ ఓవర్లో రెండు సిక్సర్లు ఓ ఫోర్‌తో 18 పరుగులు రాబట్టి యశ్ దయాల్ మరుసటి ఓవర్లో 6, 6, 4తో 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత బలైంది విల్ జాక్స్. 8వ ఓవర్లో తొలి బంతికి అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) నిష్క్రమించడంతో 8 ఓవర్లలోనే 108 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వన్ డౌన్లో క్లాసెన్ రాకతో సన్‌రైజర్స్ స్కోరు రాకెట్ వేగాన్ని తలపించింది. అప్పటికే 70లలోకి వచ్చిన హెడ్‌కు క్లాసెన్ అగ్నికి వాయువు తోడైనట్టు అయ్యాడు. విజయ్‌కుమార్ వైశాఖ్ 12వ ఓవర్లో హెడ్.. 3 బౌండరీలు బాది 39 బంతుల్లోనే శతకాన్ని పూర్తిచేశాడు. 12 ఓవర్లకే సన్‌రైజర్స్ 150 పరుగుల మార్కు దాటింది.
భయపెట్టిన కార్తీక్
122 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బెంగళూరు 262 దాకా వచ్చిందంటే అది దినేశ్ కార్తీక్ చలవే. గెలుపుపై ఆశలే లేని స్థితి నుంచి గెలుస్తామేమో అన్నట్టుగా కార్తీక్ విధ్వంసం సాగింది. లోమ్రర్ (19)తో కలిసి ఆరో వికెట్‌కు 59 పరుగులు జోడించిన కార్తీక్.. అనూజ్ రావత్ (25 నాటౌట్)తో ఏడో వికెట్‌కు 63 రన్స్ జతచేశాడు. బౌలర్ ఎవరన్నదీ లెక్కచేయకుండా బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే తన డ్యూటీ అన్నట్టుగా కార్తీక్ వీరవిహారం చేశాడు. 23 బంతుల్లోనే 50 పూర్తిచేసిన కార్తీక్.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించాడు. ఎట్టకేలకు నటరాజన్ 19వ ఓవర్లో ఐదో బంతికి క్లాసెన్ క్యాచ్ పట్టడంతో కార్తీక్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ముగిసింది. అనూజ్ ఆఖరి ఓవర్లో 18 పరుగులు రాబట్టడంతో ఆర్సీబీ విజయానికి 25 పరుగుల దూరంలో ఆగిపోయింది.
4 హైదరాబాద్‌తో మ్యాచ్‌లో నలుగురు బెంగళూరు బౌలర్లు..రికీ టోప్లె(68), యశ్ దయాల్(51), ఫెర్గుసన్(52), జయ్‌కుమార్(64) 50కి పైగా పరుగులు ఇచ్చారు. ఐపీఎల్ చరిత్రలో ఇది తొలిసారి.
2 ఐపీఎల్ అత్యధిక టీమ్ స్కోరు నమోదు చేయడం హైదరాబాద్‌కు ఈ సీజన్లో ఇది రెండో సారి. ముంబైపై 277/3 తొలి అత్యధిక స్కోరు సాధించింది. .
బ్యాటర్ల ఆధిపత్యం చెలరేగిన ఈ మ్యాచ్‌లో ఏ ఒక్క బౌలర్ కూడా 10 కంటే తక్కువ ఎకానమీ నమోదుచేయలేదు. రీస్ టాప్లీ 4 ఓవర్లలో 68 పరుగులు సమర్పించుకోగా భువీ 4 ఓవర్లలో 60 పరుగులిచ్చాడు.
హైదరాబాద్ 287/3
బెంగళూరు 262/7
ఫోర్లు: 43, సిక్స్‌లు: 38
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్ : 20 ఓవర్లలో 287/3 (హెడ్ 102, క్లాసెన్ 67, ఫెర్గూసన్ 2/52, టాప్లీ 1/68)
బెంగళూరు : 20 ఓవర్లలో 262/7 (కార్తీక్ 83, డుప్లెసిస్ 62, కమిన్స్ 3/43, మార్కండె 2/46)
టీ20ల్లో అత్యధిక స్కోర్లు
549: ఎస్ఆర్హెచ్ X ఆర్సీబీ(2024)
523: ఎస్ఆర్హెచ్ X ముంబై(2024)
517: వెస్టిండీస్ X దక్షిణాఫ్రికా(2023)
ఐపీఎల్లో అత్యధిక స్కోర్లు
287/3 ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ (2024)
277/3 ముంబైపై ఎస్ఆర్హెచ్ (2024)
272/5 ఢిల్లీపై కోల్‌కతా (2024)
263/5 పుణెపై బెంగళూరు (2013)
257/7 పంజాబ్‌పై లక్నో (2023)
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు
22:ఎస్ఆర్హెచ్ X ఆర్సీబీ (2024)
21: ఆర్సీబీ X పుణె (2013)
20: ఆర్సీబీ X గుజరాత్ (2016)
20: ఢిల్లీ X గుజరాత్ (2017)