హైదరాబాద్, ఆట ప్రతినిధి : భారత ర్యాలీ రేసర్, హైదరాబాద్‌కు చెందిన పులిగిళ్ల నవీన్ అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటాడు. ఎఫ్ఐఏ ఆఫ్రికన్ ర్యాలీ చాంపియన్‌షిప్ (ఏఆర్సీ) మూడో రౌండ్ రువాండా మౌంటైన్ గొరిల్లా ర్యాలీలో విజేతగా నిలిచాడు. సోమవారం ముగిసిన ఈ రేస్‌లో భారత్‌కే చెందిన కో డ్రైవర్ మూసా షరీఫ్‌తో కలిసి టీమ్ డ్యూరాన్ రేసింగ్ తరఫున బరిలోకి దిగిన నవీన్ ఏఆర్సీ3 కేటగిరీలో ట్రోఫీ అందుకున్నాడు.
ఫోర్డ్ ఫియస్టా ర్యాలీ3 కారుతో నవీన్-మూసా కఠినమైన గ్రావెల్ రోడ్లపై గంటకు 170 కిమీ వేగంతో దూసుకెళ్లారు. మొత్తం 18 స్పెషల్ స్టేజ్లలో 12 చోట్ల విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్త్తూ 2 గంటల 13 నిమిషాల 48.3 సెకండ్లలో ర్యాలీని పూర్తి చేశారు. ఈ విజయంతో నవీన్, మూసా ఏఆర్సీ3 చాంపియన్‌షిప్ పట్టికలో రెండో స్థానానికి ఎగబాకారు.