హైదరాబాద్, ఆట ప్రతినిధి: అరంగేట్రం తెలంగాణ ప్రొ బాస్కెట్‌బాల్ లీగ్(టీపీబీఎల్)లో హైదరాబాద్ హనీ బ్యాడ్జర్స్ టైటిల్ విజేతగా నిలిచింది. గురువారం రాత్రి యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ ఫైనల్లో హైదరాబాద్ 70-63 పాయింట్లతో నిజాం నవాబ్స్పై అద్భుత విజయం సాధించింది. ఆద్యంతం ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హైదరాబాద్ ప్లేయర్లు సమష్టి ప్రదర్శనతో సత్తాచాటారు.
లీగ్ విజేత హైదరాబాద్‌కు రూ.20లక్షలతో పాటు అత్యంత విలువైన ఆటగానికి యమహా ఆర్15 బైక్‌ను అందజేశారు. పోటీల ముగింపు కార్యక్రమానికి మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి హాజరయ్యారు. ప్రొఫెషనల్‌గా బాస్కెట్‌బాల్ టోర్నీని ఘనంగా నిర్వహించిన రాష్ట్ర అసోసియేషన్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్(టీబీఏ) అధ్యక్షుడు రావుల శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యరద్శి పృధ్వీశ్వర్రెడ్డి, టీవోఏ కార్యదర్శి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.