హైదరాబాద్, ఆట ప్రతినిధి: జీఎంఆర్ రగ్బీ ప్రీమియర్ లీగ్(ఆర్పీఎల్) తొలి సీజన్లో హైదరాబాద్ హీరోస్ హ్యాట్రిక్ విజయంతో అదరగొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 43-12 తేడాతో కళింగ బ్లాక్టైగర్స్పై ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న హీరోస్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ పోరులో హీరోస్ ఏడు టైలను సాధించింది. జట్టులో ఆరుగురు ప్లేయర్లు టైలు చేసి తమ సత్తాచాటారు. జోజి నాసోవా రెండు టైలతో అద్భుత ప్రదర్శన కనబర్చగా, టెరియో తమాని నాలుగు టైలను గోల్‌గా మలిచి జట్టుకు 8 పాయింట్లను అందించాడు. మ్యాచ్‌లో తొలుత కళింగ ఆధిపత్యం ప్రదర్శించినా.. ఆ తర్వాత పుంజుకున్న హైదరాబాద్ వరుస పాయింట్లతో జోరు కనబరిచింది. కీలకమైన ద్వితీయార్థంలో అదే దూకుడుతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.