హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచ స్థాయి కార్యక్రమాలకు తరచుగా ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్.. వచ్చే ఏడాది ఈ-మొబిలిటీ వీక్తోపాటు ఎలక్ట్రిక్ వాహనాల ఫార్ములా రేస్ (ఈ-ప్రిక్స్)కు వేదికగా నిలువనున్నది. ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు జరిగే ఈ కార్యక్రమాల లోగో, www.evhyderabad.in వెబ్‌సైట్‌ను మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి శుక్రవారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. పర్యావరణ వ్యవస్థను కాపాడటంపై ఈ-మొబిలిటీ వీక్‌లో చర్చలు, సదస్సులు జరుగుతాయని, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. జీరో ఎమిషన్ వాహనాలకు అనువైన వాతావరణాన్ని సృష్టించడంలో తెలంగాణ ఎంతో ముందున్నదని, దేశంలో ఈవీలకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.