హైదరాబాద్, ఆట ప్రతినిధి: కోల్‌కతా వేదికగా జరుగుతున్న మహిళల అండర్-23 టీ20 ట్రోఫీలో హైదరాబాద్ క్రికెటర్లు గొంగడి త్రిష, ఇషిత మెరుపులు మెరిపించారు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 22 పరుగుల తేడాతో కేరళపై ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 116/9 స్కోరు చేసింది.
కెప్టెన్ త్రిష(67) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, ప్రణవి చంద్ర(24) రాణించింది. తొలి వికెట్‌కు వీరిద్దరు కలిసి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. త్రిష తన ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, సిక్స్‌తో విజృంభించింది. అయితే ప్రణవి ఔట్ తర్వాత హైదరాబాద్ బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కేరళ.. ఇషిత(4/10), పూజ(2/16) ధాటికి 17.4 ఓవర్లలో 94 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ నజ్ల(33), జోషిత(30) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు.