హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) 87వ ఏజీఎమ్ కొనసాగింపు సమావేశం తీవ్ర గందరగోళం మధ్య సాగింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో తాత్కాలిక అధ్యక్షుడు దల్జీత్‌సింగ్ అధ్యక్షతన ఆరు నిమిషాల్లోనే ముగిసింది. గత ఏజీఎమ్‌లో ప్రస్తావించిన పేర్లు కాకుండా కొత్త వారిని ప్రకటించడంతో రసాభాసగా మారింది.
అంబుడ్స్‌మన్‌గా మాజీ చీఫ్ జస్టిస్ సురేశ్‌కుమార్‌ను శివలాల్‌యాదవ్ ప్రతిపాదించగా, చాముండేశ్వర్‌నాథ్ బలపరిచాడు. మరోవైపు ఎథిక్స్ ఆఫీసర్‌గా జస్టిస్ కేసీ భాను పేరును వినోద్ ఇంగ్లే ప్రతిపాదించగా, రవిందర్‌సింగ్ బలపరిచాడు. సమావేశానికి హాజరైన సభ్యుల ఆమోదం లేకుండానే అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు దల్జీత్‌సింగ్ ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఈ భేటీకి నిషేధానికి గురైన 57 క్లబ్‌లకు చెందిన ప్రతినిధులను అనుమతించలేదు. దీంతో అజారుద్దీన్, శేషునారాయణతో పాటు పలువురు హాజరు కాలేకపోయారు.