‘ప్లే విత్ ఫైర్’..ఈ ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్హైదరాబాద్ స్లోగన్! ఫైర్ కాదురా బాబు ఇది వైల్డ్‌ఫైర్ అంటూ రైజర్స్ బ్యాటర్లు ఉప్పల్‌లో రికార్డుల హోరు సృష్టించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను చీల్చిచెండాడుతూ సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యుత్తమ స్కోరు (286)ను తమ పేరిట లిఖించుకున్నారు. అభిషేక్‌శర్మ, హెడ్ జోరుతో మొదలైన రైజర్స్ పరుగుల వరద ఇషాన్ కిషన్ ధనాధన్ సెంచరీతో పతాక స్థాయికి చేరుకుంది. రైజర్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న పాకెట్ డైనమైట్ ఇషాన్.. ఉప్పల్‌లో రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. కండ్లు చెదిరే ఫోర్లు, సిక్స్‌లతో అభిమానులను హోరెత్తించాడు. భారీ లక్ష్యఛేదనలో జురెల్, శాంసన్ అర్ధసెంచరీలతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. ఈ సీజన్లో హైదరాబాద్ తమ ప్రత్యర్థులకు కాస్కోండి అంటూ హెచ్చరికలు పంపి 18వ సీజన్‌ను అదిరిపోయే రికార్డులతో మొదలుపెట్టింది.
Sunrisers Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్-18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే బోణీ కొట్టింది. నిరుటి సీజన్ జోరును ఏమాత్రం తగ్గకుండా కొనసాగిస్తూ భారీ విజయంతో కదంతొక్కింది.ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 44 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత ఇషాన్ కిషన్(47 బంతుల్లో 106 నాటౌట్, 11ఫోర్లు, 6సిక్స్‌లు), ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 67, 9ఫోర్లు, 3సిక్స్‌లు) చెలరేగడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 286-6 స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యుత్తమ స్కోరు. తుషార్ (3-44), తీక్షణ(2-52) రాణించారు. లక్ష్యఛేదనలో రాజస్థాన్ 242-6 స్కోరుకే పరిమితమైంది. జురెల్(35 బంతుల్లో 70, 5ఫోర్లు, 6సిక్స్‌లు), శాంసన్(37 బంతుల్లో 66, 7ఫోర్లు, 4సిక్స్‌లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. సిమ్రన్జీత్సింగ్ (2-46), హర్షల్‌పటేల్ (2-34) రెండేసి వికెట్లు తీశారు. ఇషాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
రైజర్స్ ధనాధన్
అందరూ ఊహించినట్లుగా గత సీజన్‌కు కొనసాగింపా? అన్నట్లుగా సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆది నుంచే వీరవిహారం చేశారు. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో బరిలోకి దిగిన రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ (11 బంతుల్లో 24, 5 ఫోర్లు), హెడ్.. రాయల్స్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. ఫజుల్లా ఫారుఖీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన అభిషేక్ తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. మరో ఎండ్‌లో హెడ్ తానేం తక్కువ కాదన్నట్లు బౌండరీలు బాదడంతో రైజర్స్ స్కోరు మొదటి నుంచే రాకెట్ వేగాన్ని తలపించింది. ఫారుఖీ వేసిన 3వ ఓవర్లో అభిషేక్ హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగితే హెడ్ భారీ సిక్స్‌తో విరుచుకుపడ్డాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన తీక్షణ..అభిషేక్‌ను ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అభిషేక్ ఔటయ్యాడని ఊపిరి తీసుకునేంత లోపే ఇషాన్ రూపంలో మరో సునామీ రాయల్స్‌ను ముంచెత్తింది. రెండో బంతి నుంచే దంచుడు మొదలుపెట్టిన ఇషాన్..మళ్లీ వెను దిరిగి చూసుకోలేదు. హెడ్ బాదుడుకు జోఫ్రా ఆర్చర్ బలయ్యాడు. ఐదో ఓవర్లో అతడు వరుస బంతుల్లో 4,6,0,4,4,4తో 23 పరుగులు స్కోరు బోర్డుకు జతచేశాడు. పవర్‌ప్లే పూర్తయ్యే సరికి రైజర్స్ వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. తుషార్ 10వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన హెడ్.. హెట్‌మైర్ క్యాచ్‌తో రెండో వికెట్‌గా వెనుదిరుగడంతో 85 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇక తన వంతు అన్నట్లు నితీశ్‌కుమార్‌రెడ్డి వచ్చి రావడంతోనే రాయల్స్ బౌలర్లకు ఫోర్‌తో స్వాగతం పలికాడు.
ఇషాన్ ‘పవర్’ హిట్టింగ్
ఈ సీజన్లో తొలిసారి సన్‌రైజర్స్‌కు ఆడుతున్న ఇషాన్‌కిషన్ తన సత్తాఏంటో చేతల్లో చూపెట్టాడు. జాతీయ జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఈ జార్ఖండ్ డైనమైట్ పవర్ హిట్టింగ్తో అభిమానులను అలరించాడు. ఎక్కడా గేర్ మార్చకుండా ఆడిన ఇషాన్..ఆర్చర్ 13వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లతో 25 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక లాభం లేదనుకుని తీక్షణను తీసుకొచ్చిన కెప్టెన్ పరాగ్ ప్రయత్నం నెరవేరింది. షాట్ ఆడే ప్రయత్నంలో మిడాఫ్‌లో జైస్వాల్ క్యాచ్‌తో నితీశ్ వెనుదిరుగడంతో రైజర్స్ 208-3 స్కోరు చేరింది. దీంతో తక్కువ ఓవర్లలో 200 మార్క్ అందుకున్న జట్టుగా రైజర్స్ నిలిచింది. ఓవైపు వికెట్లు పడుతున్నా..ఇషాన్ మాత్రం ఒత్తిడికి లోనుకాకుండా నింపాదిగా బ్యాటింగ్ కొనసాగించాడు. మరోవైపు క్రీజులోకి వచ్చిన క్లాసెన్ (34)..కిషన్‌కు జత కలువడంతో ఇన్నింగ్స్ స్వరూపం మారిపోయింది. ఆర్చర్ 18వ ఓవర్లో క్లాసెన్ 4, 4, 4, 4 బాదితే కిషన్ మరో ఫోర్‌తో 23 పరుగులు జతకలిశాయి. సందీప్‌శర్మ 19వ ఓవర్లో క్లాసెన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరుగగా, వరుసగా రెండు సిక్స్‌లతో ఇషాన్ రైజర్స్ అరంగేట్రం మ్యాచ్‌లోనే సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. 2016 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఇషాన్‌కు ఈ లీగ్‌లో ఇదే తొలి శతకం. గతంలో అతడి అత్యుత్తమ స్కోరు 99. జురెల్,
శాంసన్ పోరాడినా..
భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్‌కు సరైన శుభారంభం దక్కలేదు. 24 పరుగులకే జైస్వాల్(1), కెప్టెన్ పరాగ్(4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ క్రమంలో జురెల్, శాంసన్..రైజర్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ దూకుడే లక్ష్యంగా ఆడుతూ లక్ష్యాన్ని అంతకంతకు కరిగించే ప్రయత్నం చేశారు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ అభిమాలను అలరించారు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న క్రమంలో శాంసన్, జురెల్ వెంటవెంటనే ఔట్ కావడంతో రాజస్థాన్ ఓటమి ఖరారైంది. ఆఖర్లో హెట్‌మైర్(42), శుభమ్ దూబే(34 నాటౌట్) ఆకట్టుకున్నా లాభం లేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు: హైదరాబాద్: 20 ఓవర్లలో286-6(ఇషాన్ కిషన్ 106 నాటౌట్, హెడ్ 67, తుషార్ 3-44, తీక్షణ 2-52), రాజస్థాన్: 20 ఓవర్లలో 242-6(జురెల్ 70, శాంసన్ 66, హర్షల్ 2-34, సిమ్రన్‌జీత్ 2-46)
ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్లు
ఒక మ్యాచ్‌లో హయ్యస్ట్ రన్స్
అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్