హైదరాబాద్, ఆట ప్రతినిధి: బ్యాడ్మింటన్ క్రీడకు హైదరాబాద్ రాజధానిగా మారిందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పుల్లెల గోపీచంద్ అకాడమీలో అనంత్ బజాజ్ స్మారక సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బ్యాడ్మింటన్ ఆటకు హైదరాబాద్ హబ్‌గా మారింది. జాతీయ చీఫ్ కోచ్ గోపీచంద్ ఎంతో మంది ప్లేయర్లను మెరికల్లాగా తీర్చిదిద్దుతున్నారు. ఈ అకాడమీ కేంద్రంగా ఒలింపిక్, ప్రపంచ చాంపియన్లు తయారవుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్, షట్లర్లు శ్రీకాంత్, సాయి ప్రణీత్, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు.