బార్బడోస్: వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ కర్ట్లీ ఆంబ్రోస్ ఈ తరం క్రికెటర్లకు గుర్తుండకపోవచ్చు. ఒకప్పుడు అజేయ జట్టుగా విండీస్ ఆధిపత్యం చెలాయించిన రోజుల్లో ఆ జట్టుకు ఆంబ్రోస్ కీలక బౌలర్‌గా నిలిచాడు. ఆ లెజెండరీ బౌలర్‌కు ఇండియాన్ బౌలర్ బుమ్రా అంటే చాలా ఇష్టం. బ్రుమాకు తాను వీరాభిమానిని అని ఆంబ్రోస్ తెలిపాడు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆంబ్రోస్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బుమ్రా తన బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదని, ఒకవేళ గాయం అయితే తప్ప ఎటువంటి మార్పు అవసరం లేదన్నాడు. బుమ్రా గురించి మీకో విషయం చెబుతానని, అతనికి నేను ఓ అభిమానిని అని, అతన్ని తొలిసారి చూసిన క్షణం నుంచి ఫ్యాన్‌గా మారిపోయానని, యాక్షన్ భిన్నంగా ఉన్నా.. చాలా ప్రభావంతమైన బౌలింగ్ చేస్తుంటాడని, అతనిలో ఆ ట్యాలెంట్ నచ్చిందని ఆంబ్రోస్ పేర్కొన్నాడు. సంప్రదాయ ఫాస్ట్ బౌలర్లకు భిన్నంగా బుమ్రా ఉంటాడని, ఇండియాకు అతను ఎంతో చేశాడని, అన్ని ఫార్మాట్లలో ఇప్పటికీ అతను మెరుగ్గా రాణిస్తున్నాడని, ఆంటిగ్వాకు వచ్చిన సమయంలో అతన్ని పలుమార్లు కలిసినట్లు ఆంబ్రోస్ తెలిపాడు. బుమ్రా బౌలింగ్‌ను తాను ఎప్పుడూ ఎంజాయ్ చేసినట్లు ఆంబ్రోస్ చెప్పాడు.