భారత్ లో ఎండలు మండిపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు అరేబియా తీరాన్ని తాకడానికి చేరువలో ఉండటంతో దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు కాస్త చల్లబడినా.. ఉత్తర భారతంలో మాత్రం ఎండలకు తోడు వడగాలుల కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తుతున్నారు. ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నాయి.
తాజాగా ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా జూన్ 9న తొలి టీ20 ఆడేందుకు గాను ఢిల్లీకి చేరుకున్న సఫారీ జట్టు కూడా ఎండలకు తాళలేకపోతున్నది. ఇదే విషయమై సఫారీ స్పిన్నర్ తబ్రెజ్ షంషీ స్పందిస్తూ.. ‘ఇవేం ఎండల్రా బాబోయ్..’ అంటూ కామెంట్స్ చేశాడు. ట్విటర్ వేదికగా అతడు స్పందిస్తూ.. ‘బయట 42 డిగ్రీల చల్లగా ఉంది. అస్సలు వేడిగా ఉండదు..’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
అనంతరం ట్విటర్ లో ఓ నెటిజన్.. ‘లాహోర్ లో 43 డిగ్రీలు ఉంది..’ అని రిప్లై ఇచ్చాడు. దీనికి షంషీ స్పందిస్తూ.. ‘వామ్మో.. అంత ఎండల్లో జనాలు ఎలా బతుకుతున్నారు..?’ అని రిప్లై ఇచ్చాడు. తొలి టీ20 ఆడబోతున్న ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు ఉన్నాయని వాతావరణ శాఖ ద్వారా తెలుస్తున్నది.
ఢిల్లీ మ్యాచ్ కు టికెట్లన్నీ అమ్మకం..
జూన్ 9న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగబోయే తొలి టీ20 మ్యాచ్ కు టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయని సమాచారం. ఇదే విషయమై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) జాయింట్ సెక్రటరీ రాజన్ మాట్లాడుతూ.. ‘94 శాతం టికెట్లు అమ్ముడయ్యాయి. మరో ఐదువందల టికెట్లు మాత్రమే మిగిలాయి. మ్యాచ్ ప్రారంభమయ్యేనాటికి అవి కూడా అమ్ముడవుతాయి..’ అని చెప్పాడు.
Just a cool 42 degrees outside 🤯
..not hot at all lol #Delhi #India
— Tabraiz Shamsi (@shamsi90) June 6, 2022