భువనేశ్వర్: ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్ అజేయంగా కొనసాగుతున్నది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా గురువారం వేల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-2 తేడాతో విజయం సాధించింది. ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్‌లో టీమ్ఇండియా తరఫున ఆకాశ్‌దీప్‌సింగ్(32ని, 45ని) డబుల్ గోల్స్ చేయగా, శంషేర్‌సింగ్(21ని), హర్మన్‌ప్రీత్‌సింగ్(59ని) ఒక్కో గోల్ నమోదు చేశారు. గ్యారెత్(42ని), జాకబ్ డ్రేపర్(44ని) వేల్స్‌కు గోల్స్ అందించారు.
అయితే వేల్స్‌పై విజయం సాధించినా భారత్ నేరుగా క్వార్టర్స్ బెర్తు దక్కించుకోలేకపోయింది. గ్రూపు-డీలో ఇంగ్లండ్, భారత్ ఏడేసి పాయింట్లతో సమంగా నిలిచినా..గోల్స్ తేడా(9-4) పరంగా మన కంటే మెరుగ్గా ఉన్న ఇంగ్లండ్ క్వార్టర్స్‌లోకి నేరుగా ప్రవేశించింది. క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. ఇదిలా ఉంటే అంతకుముందు జరిగిన గ్రూపు-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4-0 తేడాతో స్పెయిన్‌పై ఘన విజయం సాధించింది. రాఫెర్ ఫిల్(10ని), కాండన్ డేవిడ్(21ని), నికోలస్(50ని), అన్సెల్ లియామ్(51ని) ఇంగ్లండ్ తరఫున గోల్స్ చేశారు.
భారీ విజయం సాధిస్తే తప్ప నేరుగా క్వార్టర్స్ బెర్తు దక్కించుకోలేని పరిస్థితుల్లో బరిలోకి దిగిన భారత్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయింది. ర్యాంకింగ్స్ పరంగా తమ(5) కంటే తక్కువ ర్యాంక్(14)లో ఉన్న వేల్స్‌ను నిలువరించలేకపోయింది. మ్యాచ్‌లో ఎక్కువ శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా.. పెనాల్టీ కార్నర్లను గోల్‌గా మలచడంలో టీమ్ఇండియా ఘోరంగా విఫలమైంది. మ్యాచ్‌లో ఏడు పెనాల్టీ కార్నర్లు లభిస్తే అందులో ఐదు విఫలం కాగా రెండు సార్లు మాత్రమే భారత ప్లేయర్లు సఫలమయ్యారు. దీనికి తోడు మరో ఆరుసార్లు వేల్స్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా దాడులు చేసినా గోల్ సాధించలేకపోయింది. దీంతో తొలి క్వార్టర్ ముగిసే సరికి స్కోరు 0-0గా ఉంది.
రెండో క్వార్టర్ మొదలైన కొద్దిసేపటికే దక్కిన పెనాల్టీ కార్నర్‌ను శంషేర్‌సింగ్ గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. రీబౌండ్ అయిన బంతిని అక్కడే కాచుకుని ఉన్న శంషేర్‌సింగ్ కండ్లు చెదిరే రీతిలో గోల్‌గా మలిచాడు. మూడో క్వార్టర్లో ఆకాశ్‌దీప్‌సింగ్ రెండు ఫీల్డ్ గోల్స్‌తో విజృంభించాడు. వేల్స్ రక్షణ శ్రేణిని ఖంగుతినిపిస్తూ ఆకాశ్ కొట్టిన గోల్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. అయితే మరోవైపు అప్పటి వరకు భారత్ దాడులను తిప్పికొట్టిన వేల్స్ తొలిసారి మన గోల్‌పోస్ట్‌పై దాడి చేసింది.
రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి అనూహ్యంగా పుంజుకుంది. దీంతో అవాక్కవ్వడం భారత్ వంతు అయ్యింది. ఆఖరిదైన నాలుగో క్వార్టర్లో గేర్ మార్చిన టీమ్ఇండియా..వేల్స్ గోల్‌పోస్ట్‌పై దాడులు తీవ్రం చేసింది. ఓవైపు వరుసగా పెనాల్టీ కార్నర్ అవకాశాలు వస్తున్నా..సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతూ వచ్చిన భారత్‌కు ఆఖర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్ గోల్‌తో విజయాన్నందుకుంది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక డ్రాతో భారత్ ఏడు పాయింట్లతో ఇంగ్లండ్(7) తర్వాత రెండో స్థానంలో నిలిచి కివీస్‌తో క్రాస్ఓవర్ మ్యాచ్‌కు సిద్ధమైంది.