Commonwealth Games | ఢిల్లీ: నాలుగేండ్లకోసారి జరిగే కామన్వెల్త్ క్రీడల (సీడబ్ల్యూజీ)లో భాగంగా 2026లో స్కాట్లాండ్లోని ప్రఖ్యాత గ్లాస్గో నగరంలో జరగాల్సి ఉన్న కామన్వెల్త్ క్రీడలకు ముందే భారత క్రీడాలోకానికి తీవ్ర అన్యాయం! 2026 జులై 23 నుంచి ఆగస్టు 2 దాకా జరుగబోయే 23వ కామన్వెల్త్ క్రీడలలో మన క్రీడాకారులు పతకాలు సాధించే పలు కీలక క్రీడాంశాలలోని తొమ్మిదింటిని తొలగిస్తున్నట్టు మంగళవారం కామన్వెల్త్ క్రీడా సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ అధికంగా పతకాలు సాధించే బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, స్కాష్ వంటి వాటితో పాటు ట్రయథ్లాన్, నెట్ బాల్, రోడ్ రేసింగ్, గత ఎడిషన్‌లో చేర్చిన క్రికెట్ (మహిళల టీ20)నూ నిర్వాహకులు తొలగించారు. 2022 బర్మింగ్‌హామ్‌లో 19 క్రీడాంశాలతో ఈ క్రీడలను నిర్వహించగా 2026 ఎడిషన్‌కు గాను వాటిలో తొమ్మిదింటిని పక్కనబెట్టడం గమనార్హం. పలు ఈవెంట్స్‌ను తొలగించిన సమాఖ్య.. మరో 10 క్రీడాంశాలను చేర్చుతున్నట్టు తెలిపింది. వ్యయ నిర్వహణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది.‘మెగా ఈవెంట్లో బహుళ క్రీడల అనుభూతిని ఆస్వాదించేలా చేయడంతో పాటు వ్యయ, నిర్వహణ మధ్య సమతుల్యతను పాటిస్తాం’ అని సీడబ్ల్యూజీ తెలిపింది.
భారత్‌కు భారీ నష్టం
ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ స్థాయి పోటీతో పాటు ఆ ప్రమాణాలను అందుకోలేక పతకాల వేటలో వెనుకబడుతున్న మన క్రీడాకారులు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో మాత్రం అంచనాలకు మించి రాణిస్తారు. 2018 కామన్వెల్త్ క్రీడలలో 66 పతకాలతో పతకాల పట్టికలో 3వ స్థానంలో నిలిచిన భారత్.. 2022లో 61 పతకాలు సాధించి 4వ స్థానం దక్కించుకుంది. 1958 నుంచి ఈ మెగా టోర్నీలో ఇప్పటిదాకా పాయింట్ల పట్టికలో మనం టాప్-8లోనే నిలుస్తున్నాం. ఇందులో మన క్రీడాకారులు అత్యధికంగా పతకాలు సాధించే బ్యాడ్మింటన్, షూటింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడాంశాలు లేకపోవడంతో రాబోయే సీడబ్ల్యూజీలో భారత పతక అవకాశాలు సగానికి సగం తగ్గే ప్రమాదముంది. 2018 ఎడిషన్‌లో వచ్చిన 66 మెడల్స్‌కు గాను అత్యధికంగా 44 (షూటింగ్లో 16, రెజ్లింగ్ 12, టేబుల్ టెన్నిస్‌లో 8, బ్యాడ్మింటన్‌లో 6, స్కాష్‌లో 2) ఈ క్రీడల్లోవే. ఇక గత ఎడిషన్‌లో 61 పతకాలకు గాను రెజ్లింగ్‌లో 12, టేబుల్ టెన్నిస్‌లో 7, బ్యాడ్మింటన్‌లో 6, స్కాష్‌లో 2 (మొత్తం 27) ఎక్కువగా ఈ క్రీడల్లో సాధించినవే. బర్మింగ్‌హామ్‌లోనే షూటింగ్‌ను పక్కనబెట్టి కొత్తగా చేర్చిన మహిళా క్రికెట్ టీ20 (2022లో భారత్‌కు రజతం)లనూ తర్వాతి ఎడిషన్‌లో తొలగించడంతో భారత్‌కు పతకాలు భారీగా తగ్గుతాయని క్రీడాభిమానులు వాపోతున్నారు. 1998లో చేర్చిన హాకీని సైతం ఈసారి తీసేశారు. 2022లో భారత్‌కు హాకీలో రెండు పతకాలు (రజతం, కాంస్యం) వచ్చాయి.
గ్లాస్గో క్రీడలు పూర్తిగా భిన్నం : ఎన్ఆర్ఏఐ
సీడబ్ల్యూజీ నిర్ణయంపై నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) స్పందిస్తూ.. ‘రాబోయే క్రీడల్లో షూటింగ్‌ను చేర్చకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. వచ్చే కామన్వెల్త్ క్రీడలలో ఒలింపిక్స్‌లో ప్రముఖ క్రీడలలో చాలావాటిని పక్కనబెట్టడంతో అవి పూర్తి భిన్నంగా ఉండనున్నాయి. షూటింగ్‌ను చేర్చడానికి క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్ సమాఖ్య (ఐవోఏ) చాలా యత్నించింది. అవసరమైతే షూటింగ్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామనీ కోరినా ఫలితం లేకపోయింది’ అని తెలిపింది. ఇదే విషయమై భారత దిగ్గజ షూటర్ గగన్ నారంగ్ కూడా తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశాడు.
తొలగించేవి
రెజ్లింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్కాష్, హాకీ, ట్రయథ్లాన్, రోడ్ రేసింగ్, క్రికెట్ చేర్చేవి స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, పారా పవర్ లిఫ్టింగ్, పారా అథ్లెటిక్స్, పారా ట్రాక్ సైక్లింగ్, ట్రాక్ సైక్లింగ్, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో, పారా బౌల్స్, 3X3 వీల్ చైర్ బాస్కెట్ బాల్, బాస్కెట్ బాల్ ఇది కుట్ర ఈ నిర్ణయం షాక్‌కు గురిచేయడమే గాక భారత క్రీడాలోకానికి పెద్ద వెనుకడుగు. దీనివల్ల భారత్ 40 పతకాలు కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇది కేవలం క్రీడలు, క్రీడాకారులకు జరిగిన నష్టమే కాదు. భారత్‌లో ఈ క్రీడలకు పెరుగుతున్న ఆదరణ, వస్తున్న పతకాలను కుదించడానికి చేస్తున్న కుట్రగా అనిపిస్తోంది. దీనిపై బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) తరఫున నిరసన వ్యక్తం చేస్తాం.
-సంజయ్ మిశ్రా, బాయ్ సెక్రటరీ
సీడబ్ల్యూజీ అవసరం లేదు
కామన్వెల్త్ క్రీడలకు బదులు ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్‌ను మాత్రమే నిర్వహించడం ఉత్తమం. సీడబ్ల్యూజీ దాని ప్రభను కోల్పోతుంది. నా అభిప్రాయం ప్రకారం ఇక దాని అవసరం కూడా లేదు. బ్యాడ్మింటన్‌తో పాటు భారత్‌కు పతకాలు వచ్చే మరికొన్ని ఈవెంట్స్‌ను తొలగించడం బాధాకరం.
– విమల్ కుమార్, బ్యాడ్మింటన్ మాజీ ఆటగాడు
తీరని అన్యాయం
బ్యాడ్మింటన్ మనకు అపారమైన గౌరవం, అపూర్వ విజయాలను తెచ్చింది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై మెరవాలనుకుంటున్న వర్ధమాన ఆటగాళ్లకు ఇది శరాఘాతం. ఈ నిర్ణయం కేవలం భారత బ్యాడ్మింటన్‌కే కాదు, ప్రపంచ క్రీడాలోకానికి నష్టాన్ని చేకూర్చేదే. దీనికి వ్యతిరేకంగా భారత్ గొంతెత్తాలి.
– పుల్లెల గోపీచంద్ , భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్
డబ్ల్యూజీలో భారత్ అత్యధికంగా పతకాలు సాధించిన క్రీడాంశాలు
ఈ నాలుగూ 2026లో కనిపించవు.