ముంబై : సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి దుమ్మరేపింది. సొంతగడ్డలోనే కాదు.. ప్రత్యర్థి జట్లు వారి హోంగ్రౌండ్స్లో తమ ఎదుట రికార్డు లక్ష్యాలను నిలిపినా తమకు తిరుగులేదని మళ్లీ నిరూపించింది. ప్రఖ్యాత వాంఖెడే స్టేడియంలో ముంబై నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 76, 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), హెన్రిచ్ క్లాసెన్ (30 బంతుల్లో 65 నాటౌట్, 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 45, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సలిల్ అరోరా (10 బంతుల్లో 30 నాటౌట్, 2 ఫోర్లు, సిక్స్‌లు) దంచికొట్టారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై.. రియాన్ రికెల్టన్ (55 బంతుల్లో 123 నాటౌట్, 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ శతకానికి తోడు విల్ జాక్స్ (22 బంతుల్లో 46, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (15 బంతుల్లో 31, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో 20 ఓవర్లకు 243/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్లో హైదరాబాద్‌కు ఇది ఆరో విజయం కాగా ముంబైకి ఆరో ఓటమి.
రికార్డు ఛేదనలో హైదరాబాద్‌కు ఓపెనింగ్ జోడీ ‘ట్రావిషేక్’ అదిరిపోయే ఆరంభాన్నిస్తే ‘కాటేరమ్మ కొడుకు’ హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా మెరుపులతో లక్ష్యాన్ని సన్‌రైజర్స్ మరో 8 బంతులుండగానే పూర్తిచేసింది. ఈ సీజన్లో ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న హెడ్.. బౌల్ట్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లతో టచ్‌లోకి వచ్చాడు. అక్కడ్నుంచి అతడి విధ్వంసం తారాస్థాయికి చేరింది. అవతలి ఎండ్‌లో అభిషేక్ సైతం బాదుడులో హెడ్‌తో పోటీపడటంతో పవర్‌ప్లేలోనే ఎస్ఆర్హెచ్ వికెట్లేమీ నష్టపోకుండా 92 రన్స్ చేసింది. 20 బంతుల్లోనే హెడ్ ఈ సీజన్లో తొలి హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. 8 ఓవర్లకే 126/0గా ఉన్న హైదరాబాద్‌కు 9వ ఓవర్లో ఘజన్ఫర్ వరుస షాకులిచ్చి అభిషేక్, ఇషాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. తర్వాత హార్ధిక్ బౌలింగ్‌లో హెడ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన క్లాసెన్.. నితీశ్ (21) అండతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. అశ్వని ఓవర్లో నాలుగు బౌండరీలు బాదిన అతడు.. ఘజన్ఫర్ బౌలింగ్‌లో సిక్స్‌తో ఫిఫ్టీ పూర్తైంది. సన్‌రైజర్స్ గెలుపునకు 4 ఓవర్లలో 32 రన్స్ మాత్రమే అవసరమవగా నితీశ్‌ను బౌల్ట్ ఔట్ చేసినా ఆఖర్లో క్లాసెన్ జతగా అరోరా పని పూర్తిచేశాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబైకి కొత్త ఓపెనింగ్ జోడీ జాక్స్, రికెల్టన్ ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లేలోనే వికెట్లేమీ నష్టపోకుండా 78 రన్స్ చేసిన ఈ ద్వయం 43 బంతుల్లోనే 93 రన్స్ జోడించింది. బౌలర్లు మారినా వీరి బాదుడులో మార్పు లేకపోవడంతో ముంబై దూకుడుగా ఆడింది. నితీశ్ తన మొదటి ఓవర్లోనే జాక్స్‌ను ఔట్ చేయగా సూర్యకుమార్ (5) సైతం విఫలమయ్యాడు. మరో ఎండ్‌లో 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన రికెల్టన్ ఆ తర్వాత జోరు పెంచాడు. నమన్ (22), హార్ధిక్ అతడికి అండగా నిలిచారు. 44 బంతుల్లో శతకం పూర్తిచేసిన రికెల్టన్ ఆ తర్వాత నెమ్మదించాడు. ఐపీఎల్లో అతడికి ఇదే తొలి శతకం. రికెల్టన్ జోరు తగ్గినా మరో ఎండ్‌లో హార్ధిక్ మెరుపులు మెరిపించాడు. అయితే అతడు నిష్క్రమించాక ముంబై పరుగుల వేటలో వెనుకబడింది.
ముంబై: 20 ఓవర్లలో 243/5 (రికెల్టన్ 123*, జాక్స్ 46, హింగె 2/54, మలింగ 1/29);
హైదరాబాద్: 18.4 ఓవర్లలో 249/4 (హెడ్ 76, క్లాసెన్ 65*, ఘజన్ఫర్ 2/51, హార్ధిక్ 1/39)