రీఎంట్రీ తర్వాత అదరగొడుతున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా భారత జట్టుకు అమూల్యమైన ఆస్తి అని అంటున్నాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్. విరామం అతడి దృక్పథాన్ని మార్చేసిందని.. పొట్టి ఫార్మాట్లో అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అని కొనియాడాడు. ఇటీవలే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ ఆకట్టుకున్న హార్దిక్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.
పాకిస్తాన్‌తో మ్యాచ్ అనంతరం జాఫర్ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘హార్ధిక్ గొప్ప ఆటగాడు. అదీగాక మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ అతడు రాణించడం బాగుంది. భారత జట్టులో అతడు చాలా ముఖ్యమైన ఆటగాడు.. జట్టుకు అమూల్యమైన ఆస్తి..’ అని అన్నాడు.
హార్దిక్ పాండ్యా కారణంగానే భారత జట్టు ప్రీమియర్ బౌలర్ లేకపోయినా గత కొన్ని మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనలు చేస్తున్నదని జాఫర్ చెప్పాడు. ‘హార్ధిక్ రాణిస్తుండటంతో భారత్‌కు ఓ అదనపు పేసర్‌తో పాటు స్పెషలిస్టు బ్యాటర్ కూడా దొరుకుతున్నాడు. పాండ్యా మెరుగ్గా రాణిస్తుండటంతో రాబోయే మ్యాచ్‌లలో భారత్.. అవేశ్ ఖాన్‌ను తప్పించి దీపక్ హుడా లేదా రవి బిష్ణోయ్‌ను ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి..’అని జాఫర్ తెలిపాడు.
హార్ధిక్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. అంతేగాక బ్యాటింగ్‌లో 17 బంతుల్లోనే 33 పరుగులు చేసి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మరీ ముఖ్యంగా చివరి ఓవర్లో సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించేముందు హార్ధిక్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.