కొత్తపల్లి, అక్టోబర్ 26: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఏ డివిజన్ మ్యాచ్‌లకు కరీంనగర్ తొలిసారి వేదికైంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని అల్గునూరులో కొత్తగా నిర్మించిన వెలిచాల జగపతిరావు స్మారక క్రికెట్ మైదానం హైదరాబాద్ బయట హెచ్‌సీఏ క్రికెట్ మ్యాచ్‌లకు మొదటిసారి ఆతిథ్యమిచ్చింది. ‘ఏ’ డివిజన్ వన్డే లీగ్ కమ్ నాకౌట్ పోటీల్లో భాగంగా ఆదివారం కంబైన్డ్ డిస్ట్రిక్తో ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో దక్కన్ వండర్స్ ఒక వికెట్ తేడాతో అద్భుత విజయం సాధించింది.
ఉత్కంఠగా సాగిన పోరులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కంబైన్ డిస్ట్రిక్ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. మహమ్మద్ ఆఫ్రిదీ(66 బంతుల్లో 86) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్కన్ వండర్స్ టీమ్ 42.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పో 200 పరుగులు చేసింది.
వండర్స్ టీమ్ తరఫున క్రాంతి కిరణ్(42 బంతుల్లో 88), సాయిప్రతీక్(43 బంతుల్లో 66) అదరగొట్టారు. ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన ధర్మపురి సాత్విక్(5/27) ఐదు వికెట్ల ప్రదర్శనతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. సోమవారం కంబైన్ డిస్ట్రిక్, బడ్డింగ్ స్టార్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. రాష్ట్ర క్రికెట్ చరిత్రలో తొలిసారి కరీంనగర్లో రంజీ స్థాయి మ్యాచ్‌ను బీసీసీఐ నిబంధనలతో నిర్వహించడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ మైదానాన్ని పూర్తి స్థాయిలో నిర్మించి పెవిలిన్ ఏర్పాట్లు చేయనన్నట్లు జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆగంరావు, ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మహేందర్‌గౌడ్ పేర్కొన్నారు.