Ranji Hat trick | రంజీ ట్రోఫీలో కొత్త రికార్డు నమోదైంది. సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. తొలి ఓవర్లో హ్యాట్రిక్ సాధించిన పేసర్‌గా రికార్డులకెక్కారు. రంజీ ట్రోఫీ మ్యాచ్ ప్రస్తుతం ఢిల్లీ-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్నది.
టెస్ట్ క్రికెట్లోకి పునరాగమనం తర్వాత ఇండియన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ తన కెరీర్లో భారీ పురోగతిని సాధించాడు. ఈ ఎడమ చేతి సీమర్ రంజీ ట్రోఫీ సీజన్లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించాడు. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సౌరాష్ట్ర వర్సెస్ ఢిల్లీ మ్యాచులో ఉనద్కత్ ఈ ఫీట్ సాధించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలోనే తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా ఉనద్కత్ నిలిచారు. తర్వాత మరో మూడు వికెట్లు కూడా తీసి ఢిల్లీ నడ్డి విరిచాడు.
ఢిల్లీ బ్యాటర్లు ధ్రువ్ షోరే, వైభవ్ రాహుల్, యశ్ ధుల్‌ను తొలి ఓవర్లోని 3, 4, 5 బంతుల్లో డకౌట్ చేశాడు. అప్పటికి ఢిల్లీ జట్టు స్కోర్ 0. ఢిల్లీ జట్టు 10 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో ఉన్నది. రెండో ఓవర్లో లలిత్ యాదవ్, జాంటీ సిద్ధూ, వికెట్ కీపర్ లక్ష్య థరేజా వికెట్లను కూడా ఢిల్లీ కోల్పోయింది. కాగా, ప్రస్తుతం ఢిల్లీ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 108 పరుగులుగా ఉన్నది. గత ఏడాది డిసెంబర్లో బంగ్లాతో చివరి టెస్ట్ సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. వచ్చే నెలలో సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఉనద్కత్ ఈ ఫీట్ సాధించి ప్రత్యర్థిని హెచ్చరించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.