జైపూర్: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో డిఫెండింగ్ చాంపియన్స్ హర్యానా స్టీలర్స్ జోరు కొనసాగుతున్నది. శనివారం ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు.. 38-36తో తమిళ్ తలైవాస్‌పై ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. హర్యానా తరఫున రైడర్లు శివమ్ (9 పాయింట్లు), వినయ్ (7) రాణించారు. తలైవాస్ సారథి అర్జున్ దేశ్వాల్ (13 పాయింట్లు) ఒంటరిపోరాటం వృథా అయింది.
ఈ టోర్నీలో హర్యానాకు ఇది ఆడిన 8 మ్యాచ్‌లలో ఆరో విజయం కాగా తమిళ జట్టుకు 4వ పరాభవం. మరో మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్.. 33-30తో దబాంగ్ ఢిల్లీకి షాకిచ్చింది. పాయింట్ల పట్టికలో పూణెరి పల్టన్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా అన్నే పాయింట్లు కల్గిన ఢిల్లీ, హర్యానా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.