Harshit Rana : ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాధితుడు ఎవరంటే హర్షిత్ రానా (Harshit Rana)అని ఠక్కున చెప్పేస్తారు ఎవరైనా. ‘టాలెంట్ లేదు.. అనవసరంగా కొనసాగిస్తున్నారు?’గౌతం గంభీర్ శిష్యుడు కాబట్టే అవకాశాలు’.. ఇలాంటి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడీ పేసర్. ట్రోలింగ్‌ను మౌనంగా భరిస్తూనే మైదానంలో అదరగొడుతున్నాడు రానా. తాజాగా రాంచీ వన్డే (Ranchi ODI)లో తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పాడీ స్పీడ్‌స్టర్. తన బౌలింగ్ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్న ఈ పేసర్.. ఆన్లైన్లో తనపై వస్తున్న ట్రోలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్లో గౌతం గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో హర్షిత్ రానా సభ్యుడు. అందుకే అతడికి వరసగా అవకాశాలు వస్తున్నాయని నెటిజన్లు కోడై కూస్తున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు సైతం హర్షిత్‌ను అనవసరంగా ఆడిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఇవన్నీ తన ఆటపై ప్రభావం చూపవని చాటుతూ రాంచీ వన్డేలో భారత జట్టు విజయంలో కీలకమయ్యాడీ పేస్ గన్. తనపై వస్తున్న ట్రోలింగ్‌పై స్పందింస్తూ.. ‘నేను విమర్శలను పెద్దగా పట్టించుకోను. ఒకవేళ ఆన్లైన్లో నాపై వస్తున్న విమర్శలు.. కామెంట్లను తలలోకి ఎక్కించుకోను. ఎందుకంటే.. వాటిని బుర్రలో పెట్టుకుంటే నేను క్రికెట్ ఆడలేను. అందుకే.. సాధ్యమైనంతవరకూ విమర్శలను పట్టించుకోను.
HARSHIT RANA STARTED WITH 2 WICKETS IN A SINGLE OVER. 🔥pic.twitter.com/Npvq4rqBDQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 30, 2025
నేను మైదానంలో ఏం చేయగలను అనే విషయంపైనే దృష్టి సారిస్తాను. నా గురించి బయట ఏం అనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. నేను కష్టపడేతత్వాన్నే నమ్ముకుంటాను. మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే ఫోకస్ పెడుతాను అని రానా వెల్లడించాడు. బౌలింగ్‌లో రోజురోజుకు మెరుగవుతున్న హర్షిత్.. కోచ్ మోర్నీ మోర్కెల్ సలహాలు, అర్ష్‌దీప్ సింగ్ సూచనలు ఎంతో పనికొస్తున్నాయని చెప్పాడీ స్పీడ్‌స్టర్. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండడం చాలా మాకు ఎంతో లాభిస్తోంది. జట్టులోని వాతావరణం చాలా బాగుంది. రెండో వన్డేలో నా ప్రణాళికలు ఏమీ మార్చుకోను. తొలి వన్డేలో మాదిరిగానే సఫారీలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాను’ అని రానా వివరించాడు.
Impressed by Harshit Rana’s performance in the Ranchi ODI?https://t.co/0va3gtT5z7 #INDvSA pic.twitter.com/aj4MEvJBFo
— ESPNcricinfo (@ESPNcricinfo) December 2, 2025
రాంచీ వన్డేలో 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను రానా (3-65) ఆదిలోనే వణికించాడు. తన తొలి ఓవర్లోనే ఓపెనర్ రియాన్ రికెల్టన్ను బౌల్డ్ చేసిన అతడు.. అదే ఓవర్లో క్వింటన్ డికాక్‌ను వెనక్కి పంపి మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పాడు. మిడిల్ ఓవర్లలో దంచేస్తున్న డెవాల్డ్ బ్రెవిస్ వికెట్ తీసి జట్టు విజయంలో కీలకమయ్యాడు రానా. ఇదే విధంగా నిలకడగా రాణిస్తే వన్డే జట్టులో సుస్థిరం కానున్నాడీ యంగ్‌స్టర్. అదే జరిగితే రెండేళ్లకు జరుగబోయే వన్డే ప్రపంచకప్‌లో రానా ఆడడం పక్కా అంటున్నారు విశ్లేషకులు.