లీడ్స్: గత రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న ఇంగ్లండ్.. యాషెస్ సిరీస్‌లో తొలి విజయం ఖాతాలో వేసుకుంది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. 251 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 27/0తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లిష్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది.
బ్రూక్ (75) టాప్ స్కోరర్ కాగా.. క్రాలీ (44), వోక్స్ (32 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇబ్బంది పెట్టినా.. బ్రూక్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచి ఆతిథ్య జట్టును విజయానికి చేరువ చేశాడు. స్టార్క్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన మార్క్ వుడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 19 నుంచి మాంచెస్టర్‌లో నాలుగో టెస్టు జరుగనుంది.