బేసిన్ రిజర్వ్: ఇంగ్లండ్ టెస్టు క్రికెటర్ హ్యారీ బ్రూక్(Harry Brook) కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన ఘనతను తన క్రెడిట్లో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం 9 ఇన్నింగ్స్‌లోనే 800లకు పైగా రన్స్ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో ఇండియన్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli) 9 ఇన్నింగ్స్‌లో 798 రన్స్ చేశాడు. అయితే ఆ స్కోర్‌ను ఇప్పుడు బ్రూక్ అధిగమించాడు. బ్రూక్ తొమ్మిది ఇన్నింగ్స్‌లో 807 రన్స్ చేశాడు. లెజెండరీ బ్యాటర్లు హర్బర్ట్ స్కట్లిఫ్(780), సునీల్ గవాస్కర్(778), ఎవర్టన్ వీక్స్(777)లను కూడా అతను దాటేశాడు.
న్యూజిలాండ్(New Zealand)తో ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్రూక్ సెంచరీతో అలరించాడు. అతను 184 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ సమయంలోనే కాంబ్లీ రికార్డును బ్రూక్ చెరిపేశాడు. బేసిన్ రిజర్వ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి రోజు 65 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 315 రన్స్ చేసింది. నిజానికి ఓ దశలో 21 రన్స్‌కే మూడు వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్. కానీ బ్రూక్, రూట్లు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ నాలుగో వికెట్‌కు 294 రన్స్ జోడించారు. రూట్ 101 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు.